- శాసనసభలో రాష్ట్ర జీఎస్‌టీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి
- మద్యం తయారీలో ఉపయోగించే ఈఎన్‌ఏపై జీఎస్‌టీ మినహాయింపు
- కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర చట్టంలో మార్పులు
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో వస్తు సేవల పన్ను నిబంధనలను మరింత సరళతరం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ‘తెలంగాణ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లు-2026’ను ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తరపున పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు. గత ఏడాది నవంబరులో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ నూతన బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు.
జాతీయ విధానానికి అనుగుణంగా.. జీఎస్‌టీ కౌన్సిల్ 51 నుంచి 55వ సమావేశాల వరకు చేసిన సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో ఈ సవరణలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన పరిధిలోని ఐజీఎస్‌టీ, సీజీఎస్‌టీ చట్టాలను సవరించిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర జీఎస్‌టీ చట్టంలో మార్పులు చేయడం తప్పనిసరి అయిందని పేర్కొన్నారు. 2025 సెప్టెంబరు నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున, అప్పట్లో అత్యవసరంగా ఆర్డినెన్స్ జారీ చేశామని, ఇప్పుడు దానికి సభ ఆమోదం కోరుతున్నామని చెప్పారు.
బిల్లులోని కీలక మార్పులు ఇవే:
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ.. మానవ వినియోగం కోసం తయారు చేసే మద్యం (లిక్కర్)లో వాడే ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్’ ను జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయించారు. దీని కోసం సెక్షన్ 9ను సవరించారు.
పన్ను ఎగవేత కేసుల విచారణలో మరింత పారదర్శకత కోసం సెక్షన్ 74Aను చేర్చారు. దీనివల్ల సాధారణ తప్పులుగా నమోదైన కేసులను విచారణాధారంగా ‘మోసం’ కిందకు, అలాగే మోసం కింద ఉన్న కేసులను సాధారణ తప్పుల కిందకు మార్చే వెసులుబాటు కలుగుతుంది.
గతంలో ఉన్న ‘ప్లాంట్ లేదా మెషినరీ’ అనే పదాన్ని ఇకపై ‘ప్లాంట్ మరియు మెషినరీ’గా మార్చారు. సఫారీ రిట్రీట్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు ఈ మార్పు చేశారు.
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారులు పన్ను ఎగవేతకు పాల్పడకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్, నిబంధనలను ప్రవేశపెట్టారు.
ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) పంపిణీలో స్పష్టతనిస్తూనే.. మున్సిపల్ ఫండ్, లోకల్ ఫండ్ వంటి నిర్వచనాలను సవరించారు. దీనివల్ల స్థానిక సంస్థలకు సంబంధించిన పన్ను వ్యవహారాల్లో గందరగోళం తొలగిపోనుంది.
జీఎస్‌టీ అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, ఈ-కామర్స్ కార్యకలాపాలు, వోచర్ల పైన పన్ను విధింపు వంటి అంశాల్లోనూ ఈ బిల్లు ద్వారా స్పష్టత చేకూరనుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.








