హైదరాబాద్, మహా
పోలవరం-నల్లమల సాగర్‌ను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చూపిస్తున్న లేఖకు దీనికి సంబంధం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం-నల్లమల ఇంటర్‌స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ)కు లేఖ రాసినట్టుగా వెల్లడించారు. తమ అభిప్రాయంతో జీఆర్‌ఎంబీ కూడా సమర్థించిందన్నారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సూచించామన్న ఆయన ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని చెప్పారు. అసెంబ్లీ విరామ సమయంలో ఉత్తమ్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
అతి తెలివితో రాష్ట్రానికి భారీ నష్టం చేశారు
రిట్ పిటిషన్‌లో కాదు, సూట్ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందన్నారు. వచ్చే విచారణకు తాను స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని కోర్టును కోరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్న ఆయన గతంలో ఆగి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. అతి తెలివితో బీర్ఎస్ తెలంగాణకు భారీ నష్టం చేసిందని మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం తెచ్చారని బీఆర్ఎస్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.








