Mahaa Daily Exclusive

  రూ. 2 లక్షల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టం: రేవంత్ స్వగ్రామంపై కేటీఆర్..

Share

అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొని ప్రసంగించారు. భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.

 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీకి రూ. 49 వేల కోట్లు అవుతాయని సీఎంకు బ్యాంకర్లు చెప్పారని.. అయితే, మంత్రివర్గంలో మాత్రం దీనికి రూ. 31 వేల కోట్లు అని పేర్కొంటూ తీర్మానం చేశారని తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రుణమాఫీకి రూ. 26 వేల కోట్లు కేటాయించారన్నారు.

వందశాతం రైతుల రుణాలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లెలో వందశాతం జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరితే సమాధానం లేదన్నారు కేటీఆర్. ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన ఇతర వాగ్ధానాల అమలుపై సమాధానం చెప్పే సత్తా లేదన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తే ఆమెను అవమానించారని మండిపడ్డారు.

 

బీఆర్ఎస్ హయాంలో లేని సాంకేతిక సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ నాయకులకు.. బ్యాంకు, వ్యవసాయాధికారులకు కాదు. రుణమాఫీ విషయంలో ఊరుకుంటే రైతుభరోసా అప్పుడు కూడా మోసం చేస్తారు. రైతులు కాంగ్రెస్ నేతల వెంటపడి నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది తొలి అడుగు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టం అని కాంగ్రెస్ సర్కారును కేటీఆర్ హెచ్చరించారు.

 

కాగా, రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలంటూ బుధవారం కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పరకాల మాజీ ఎమ్మెల్యే పాలతో అభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని కాంగ్రెస్‌పై ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

Latest