Mahaa Daily Exclusive

  తెలంగాణ మున్సిపల్ పోరు: బీజేపీకి జనసేన ‘చెక్’.. 2028 టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ వ్యూహం!

Share

  • బీజేపీకి మింగుడుపడని అంశం
  • పురపాలక ఎన్నికల్లో బరిలోకి జనసేన
  • పొత్తులుంటే బీజేపీకే నష్టమే
  • 2028 టార్గెట్ గా పావులు కదుపుతున్న జనసేనాని

హైదరాబాద్, మహా : నిజంగా ఇది బీజేపీకి రుచించని విషయం. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడ్డ బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొతం మేర ఉనికిని చూపింది. తాజాగా జరగబోయే పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న ఆ పార్టీకి జనసేన చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి పురపాలికల్లో బీజేపీ తానేంటో చూపించాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇందుకోసం పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే పూర్తిగా సమాయాత్తం చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే పురపాలకలకు పార్టీ ఇంచార్జీలను కూడా నియమించి అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే ప్రచారాన్ని మొదలు పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఒకటి రెండు సమావేశాలను నిర్వహించింది. కానీ అనుకోని విధంగా జనసేన పురపాలక ఎన్నికల్లో బరిలో దిగేందుకు సన్నద్దమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లకు అత్యంత నమ్మదగిన నేతగా ఉన్నారు. కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ మాట చెబితే మోడీ, అమిత్ షా లు ఆచరించి చూపుతున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ చూపిన చొరవే అన్నది బీజేపీ అగ్రనేతల నమ్మకం. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాన్ తెలంగాణపై ఫోకస్ పెట్టి పని చేస్తున్నారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన సర్పంచ్ లు గలవడంతో వారితో కొండగట్టులో సమావశం ఏర్పాటు చేసిన పవన్ తన మనసులోని మాటను బయటపెట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పాగా వేస్తామన్న సంకేతాలను ఇచ్చారు. ఈ తరుణంలో తెలంగాణ పురపాలక ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు పావులు కదపుతుండటం నిజంగా బీజేపీకి దెబ్బే. కూటమి పార్టీలు కలిసి పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ తప్పనిసరి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీ మౌనంగా ఉంటున్న తరుణంలో జనసేన పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమ టార్గెట్ 2028 అసెంబ్లీ ఎన్నికలని సంకేతాలివ్వడం పట్ల కాషాయ పార్టీలో కల్లోలం రేకెత్తిస్తోంది.

గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని రంగంలోకి దిగాలనుకున్న సమయంలో జనసేన పోటీ చేస్తే పరిస్థితి ఏంటన్న చర్చ కమలం పార్టీలో మొదలైంది. మరోవైపు జనసేనతో పొత్తుపై కాషాయ రథ సారధి రాంచందర్ రావును అడిగితే ఒంటరిగా బరిలో దిగుతామని, ఎవరి పొత్తులు అవసరం లేదని తేలిగ్గా కొట్టి పారేశారు. దీనిపై కొంత గుర్రుగా ఉన్న జనసేన నేతలు కొందరు ఏది ఏమైనా పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అయితే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నది పార్టీ అదినేత నిర్ణయంపైనే ఉందని స్పష్టం చేయడం చూస్తుంటే బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అన్నది తేలాల్సి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో రంగంలోకి దిగిన జన సేన బీజేపీతో పొత్తు పెట్టుకుని రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ అంతగా ప్రభావం చూపలేక పోయింది. పురపాలక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి సత్తా చూపుతుందా, లేక ఒంటరిగా బరిలోకి దిగి కమలం పార్టీకి సవాల్ విసురుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Latest