- సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది
- మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
- ఇంతకూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ శాఖకు మంత్రి అన్న హరీష్ రావు
- రాజకీయాలకు సినీ పరిశ్రమను వాడుకోవడం దారుణమన్న నేత
హైదరాబాద్, మహా : తెలంగాణలోని థియోటర్లలో కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందన్నారు. సినిమా రంగం గురించి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు ఆశాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి నాకు తెలియదు, నా ప్రమేయం లేదు, నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిదిపెత్తనం మరొకరిది అన్నట్లుందన్నారు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా, లేక సర్కస్ కంపెనీనా అని అన్నారు. టికెట్ల ధర పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా మరొక వైపు క్షేత్ర స్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు, చెప్పేదొకటి, చేసేది మరొకటి పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి అని హరీష్ రావు దుయ్యబట్టారు.
నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచయ్యాయో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని, ఇవాళో రేపో మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని, ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది, సినిమా మంత్రేమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు, ఐటీ మం త్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా లేనట్టా సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవు తున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు, తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది తేలాలన్నారు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్ర మగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు అంటూ దుయ్యబట్టారు.
50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు, ప్రభుత్వ మంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం, మరొకరికి శత్రుత్వం ఉండకూడదు.సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు.ఇది ప్రజా పాలన కా దు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో, ఆ వివరాలన్నీ త్వరలోనే బయట పెడతామన్నారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతు న్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తు న్నామని పేర్కొన్నారు.








