Mahaa Daily Exclusive

  పారదర్శకతకు ప్రతీక వీబీ జీ రామ్ జీ చట్టం : బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

Share

హైదరాబాద్, మహా: భారతదేశంలో ఉపాధి హామీ పథకాలు 1960ల నుంచే అమలులో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకమూ నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతితో బారిన పడి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకే పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతతో వీబీ –జీ రామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వీబీ –జీ రామ్ జీ వర్క్‌ షాప్ లో ఆయన మాట్లాడారు. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారే దిశగా దృఢంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ఒకప్పుడు 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నేడు అతిపెద్ద 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని తెలిపారు. ఈ మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా పాత సంక్షేమ మోడళ్లలో మార్పులు అవసరమని, అందుకే వీబీ –జీ రామ్ జీ అవసరమే కాకుండా అనివార్యమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న మక్కువపై ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ లేదా ఇందిరా గాంధీ పేర్లకు బదులుగా హైదరాబాద్ విమానాశ్రయానికి మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.

భారతదేశంలో ఉపాధి పథకాలు మన్రేగాకు ముందే అమలులో ఉన్నాయని గుర్తు చేశారు.
1989లో జవహర్ రోజ్ గార్ యోజన నుంచి ప్రారంభమైన ఉపాధి పథకాలు అనేక మార్పులు చెంది, 2005లో మన్రేగాగా మారాయని, ఆ సమయంలో మహాత్మా గాంధీ పేరు పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ రాలేదని విమర్శించారు. 2021 మార్చి 16న బ్రౌన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ మోడల్ “రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ అయిపోయింది” అని, 1990ల విజన్‌ను 2004లో ప్యాకేజింగ్ చేయడం ఇక పనిచేయడం లేదని స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు.

మన్రెగా కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 శాతం అన్‌స్కిల్డ్ వేతనాలను భరించడం వల్ల, రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత లేకుండా వ్యవహరించాయని, వేతనాల కృత్రిమ పెంపు, భారీ లీకేజీలు చోటుచేసుకున్నాయని అన్నారు. దానికి భిన్నంగా వీబీ –జీ రామ్ జీ చట్టం 60:40 నిధుల భాగస్వామ్య మోడల్‌ను ప్రవేశపెడుతుందని, దీని ద్వారా రాష్ట్రాల బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు.

యూపీఏ పాలన కాలంలో మన్రెగా కింద జరిగిన కుంభకోణాలపై డాక్యుమెంటెడ్ ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లో (2011) నకిలీ జాబ్ కార్డులు, కల్పిత పనులు, లేనిపోని వ్యక్తులకు చెల్లింపుల ద్వారా రూ.10,000 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని చెప్పారు. అలాగే ఒడిశా సంబల్పూర్ జిల్లాలో (2012) మరణించినవారికి, పని చేయలేని వారికి, పెన్షనర్లకు వేతనాలు చూపించడం, నకిలీ పని దినాలు, డూప్లికేట్ బిల్లులు వంటి అవకతవకలు జరిగాయని వివరించారు.

వీబీ –జీ రామ్ జీ చట్టం ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే.. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంపు, కనీసం 50 శాతం పనులు గ్రామ పంచాయతీల ద్వారా అమలు, గ్రామసభలు, గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల నిర్మాణం, జీవనోపాధి ఆధారిత పనులు, విపత్తు నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టడం అని తెలిపారు. అలాగే తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ, జీపీఎస్ -శాటిలైట్ మానిటరింగ్, ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు, వారానికొకసారి ప్రజా ప్రకటనలు వంటి చర్యలతో లీకేజీలకు పూర్తిగా చెక్ పెడతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ కర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్, సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest