Mahaa Daily Exclusive

  తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే.. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదు: కేటీఆర్

Share

  • కాంగ్రెస్ కు బీ ఆర్ ఎస్సే ప్రత్యామ్నాయం బీజేపీ కాదు
  • భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • బిజెపికి తెలంగాణలో క్షేత్రస్ధాయి బలం లేదు
  • మళ్లీ బిఅర్ఏస్ తోనే తెలంగాణకు మంచి రోజులు
  • మున్సిపల్ ఎన్నికల్లో పోరు బిఅర్ఎస్ – కాంగ్రెస్ మద్యనే
  • అదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

హైదరాబాద్, మహా: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పది సంవత్సరాలలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి భారత రాష్ట్ర సమితి వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మొదలుకొని పంచాయతీ సర్పంచుల వరకు ప్రతి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయం గాలివాటమే అని, ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులు కేవలం ద్విదృవంగా మారడం వలన, ఎన్నడూ లేని ఒక విభిన్నమైన పరిస్థితి ఏర్పడడం వలన బిజెపి గెలిచిందే తప్ప… గతంలో కానీ.. భవిష్యత్తులో కానీ బిజెపికి తెలంగాణలో క్షేత్రస్ధాయి బలం లేదు అన్నారు. అసెంబ్లీలో పోటీ చేసిన ప్రతి ఒక్క బిజెపి సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారన్నారు. బిజెపి రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల పైన, అవినీతి పైన, అక్రమాల పైన 24 నెలలుగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చేసిన అధికార దుర్వినియోగం, చెప్పిన తప్పుడు లెక్కలు అన్నీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నప్పటికీ… కృష్ణా జలాల నుంచి మొదలుకొని అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా… బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కేటీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీలను, వారి యొక్క తెలంగాణ వ్యతిరేక ఎజెండాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు రానున్న భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్, పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని, ఇతర అంశాల పైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పురపాలక ఎన్నికల్లో సమిష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్ పైన ఘనమైన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకోసం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను, హామీల అమలు మోసాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితుల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాల పైన పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇప్పటికి బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో దాదాపుగా పడిపోయిందని, రానున్న ఎన్నికల్లో పోటీ ముమ్మాటికీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఉంటుందని పార్టీ నేతలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశారు.

Latest