రామగుండంలో 800 మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం..
త్వరలోనే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తాం..
*ప్రజల జీవన ప్రమాణాలు పెంపుకు ప్రభుత్వం కృషి….
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
**అర్హులైన పేదలకు రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
**96 లక్షల కుటుంబాలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా
**5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అమలు
**పేదలకు అండగా ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు బలోపేతం చేయాలి
**రామగుండంలో డిప్యూటీ సీఎం మంత్రుల పర్యటన..
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..
లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మంత్రులు
కరీంనగర్ మహా : ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,
మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు, జే.అరుణ శ్రీ డి. వేణు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,తో కలిసి రామగుండంలో పర్యటించి నగరంలో వివిధ డివిజన్ లలో 80 కోట్ల 52 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు, టి.యూ.ఎఫ్.ఐ.డి ద్వారా 88 కోట్ల 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ సరఫరా, ఆర్&బీ శాఖ ద్వారా చేపట్టనున్న 6.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ,494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
రామగుండం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో *డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఢిల్లీలో బడ్జెట్ తయారీ సంబంధిత సమావేశం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి ఈ కార్యక్రమానికి తనను రప్పించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయడం ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన కీలకమైన అంశమని, రాష్ట్ర క్యాబినెట్ లోని మంత్రులందరిపై ఒత్తిడి పెంచుతూ రామగుండం ప్రాంతానికి అవసరమైన పనులు స్థానిక ఎమ్మెల్యే చేయించుకుంటున్నారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు.
గత పాలకులు పేదలకు వ్యతిరేకంగా పని చేశారని , ప్రజల కష్టాలను చూసి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజులలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి, ఈ ప్రాంత సమస్యలను ఆనాడే గుర్తించడం జరిగిందని అన్నారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే 22 వేల 500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందన్నారు.
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసినప్పుడే ప్రభుత్వానికి సంతోషం ఉంటుందని అన్నారు. 96 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ప్రతినెల ఉచితంగా సరఫరా చేస్తుందని అన్నారు.
29 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు 24 గంటల త్రీ ఫేస్ విద్యుత్తు , 52 లక్షల పైగా నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, 8600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు.
పేద మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఆర్థిక శక్తిగా తెలంగాణ అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలకుర్తి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో చేపడతామని అన్నారు.
స్థానికంగా రామగుండం ప్రాంత ప్రజలకు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తో భావోద్వేగ సంబంధం ఉందని, ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు కృషి మేరకు రాష్ట్ర క్యాబినెట్ రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరుస్తామని ప్లాంట్ నిర్మాణానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు.
శ్రీపాద ఎల్లంపల్లి ,ఎన్టిపిసి , సింగరేణి, కేశోరాం సిమెంట్స్, ఎరువుల కర్మాగారం వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతంలో 10 సంవత్సరాలపాటు ఎటువంటి ప్రాజెక్టులు గత పాలకుల హాయంలో తేలేదని డిప్యూటీ సీఎం విమర్శించారు.
సింగరేణి కాలరీస్ సంస్థ కాపాడేందుకు రేర్ ఎర్త్ మేటిరియల్స్ మైనింగ్ లో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు, జెన్ కో, డిస్కంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించిందని, అదే రీతిలో రాష్ట్రంలో పనిచేసే ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల బీమా ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెర వేరుస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు.
గత పాలకుల హయాంలో పేదల కోసం ఇల్లు నిర్మించ లేదని వారి కోసం మాత్రం పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 22 వేల 500 కోట్లతో మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.
రాజకీయాలకతీతంగా నిరు పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామని, రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామని అన్నారు.కార్పొరేషన్ పరిధిలో మరో తహసిల్దార్ నియమించే దిశగా క్యాబినెట్ లో అవసరమైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని తెలిపారు.
రైతన్నలకు 21 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందించామని తెలిపారు. మొండి గోడలుగా ఉన్న 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రామగుండం నగరంలో నేడు పంపిణీ చేస్తున్నామని, మరో 300 ఇండ్లకు లబ్ధిదారులను ఫైనల్ చేస్తే వారికి నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయించే కార్యక్రమం చేపడతామని అన్నారు.
1717 లబ్ధిదారులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు నేడు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సింగరేణి పరివాహక ప్రాంతంలో సింగరేణి కార్మికుల ఇంటి స్థలాలు క్రమబద్దికరించేందుకు గతంలో వైయస్సార్ జారీ చేసిన 76 ఉత్తర్వులను నేడు మరోసారి అమలు చేసి అర్హులైన కార్మికులకు తప్పనిసరిగా ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రామగుండం ప్రాంతంలో ఉన్న నిరుపేదలు, యువకులు, కార్మికులకు మంచి చేయాలని ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే నిరంతరం పని చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. చివరి ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పని చేస్తున్నారని చెప్పారు.
నగరంలో రోడ్డు వెడల్పు పనుల వల్ల నష్టపోయే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాణిజ వ్యాపార సంస్థలు నగరంలో వృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నేడు 600 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు నాంధి పలికామని అన్నారు.
ఇందిరమ్మ కమిటీ లు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి 479 మంది అర్హులకు నేడు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. అర్హత ఉండి ఇండ్లు రానివారు ఎవరు ఆందోళన చెందవద్దని, రాబోయే దశలలో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.
మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డుల జారీ, రేషన్ ద్వారా ప్రతి లభిదారుడుకు నెలకు 6 కిలోల సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
800 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం జన్ కో లేదా ఎన్.టి.పి.సి ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వైయస్సార్ హయంలో 18 వేల ఇండ్లకు క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేశామని, పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నగరంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా తప్పనిసరిగా
పరిష్కరిస్తామని అన్నారు.
*దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వెనుకబడిన రామగుండం ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వైయస్సార్ హయాం నుంచి సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద సంపద సింగరేణి సంస్థ , అర్హులైన సింగరేణి కార్మికులకు ఇంటి స్థలాలు అందించాలని రెవెన్యూ శాఖ మంత్రివర్యులను మంత్రి విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టులకు సొంతిల్లు నిర్మిస్తామని గతంలో కేసీఆర్ మోసం చేశారని, మన ప్రజా ప్రభుత్వం చిత్ర స్థాయిలో పనిచేసే ప్రతి అర్హులైన జర్నలిస్టులకు సొంత ఇండ్లు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. సమాజంలో చిన్న చూపు ఉన్న ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రశ్నించినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, మన ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు
రామగుండంలో ఆలయాల అభివృద్ధి కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ తరపున మంజూరు చేస్తామని, అవసరమైన మరిన్ని నిధులు ముఖ్యమంత్రి ఎస్. డి ఎఫ్ నుంచి మంజూరు చేసుకునేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాల చేస్తూనే ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై దృష్టి సారించిందని అన్నారు. రామగుండం నగర సర్వతో ముఖాభివృద్ధికి ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అన్నారు.
సింగరేణి మెడికల్ బోర్డు నుంచి కార్మికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్నతనంలో తాము చదువుకున్న పాఠశాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని అన్నారు. ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఎమ్మెల్యే కు సూచించారు.
*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, 10 నుంచి 15 సంవత్సరాలు పెండింగ్ ఉన్న అంశాలను పరిష్కరించి నేడు 1700 పైగా నిరుపేద కుటుంబాలకు వివిధ పథకాల ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
మేడిపల్లి గ్రామంలో దారిద్ర రేఖ దిగివకు ఉన్న 212 నిరుపేద కుటుంబాలకు, జనగామ గ్రామంలో 31 మంది ట్రాన్స్ జెండర్లకు, గోదావరిఖనిలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన 129 మంది పేద కుటుంబాలకు, మారేడు పాక గ్రామంలో చాలా కాలంగా పెండింగ్ ఉన్న సింగరేణి భూ సమస్య పరిష్కారం చేసి 162 కుటుంబాలకు, జిఓ 76 పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించి పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
నేడు పట్టాలు పంపిణీ చేసిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు 2 నెలల లోపు గృహప్రవేశం చేసే విధంగా
అవసరమైన డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. రామగుండం నగర వ్యాప్తంగా 494 మంది నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఇళ్ల పట్టాల పంపిణీ మాత్రమే కాకుండా రామగుండం నగర అభివృద్ధి కోసం 169 కోట్ల పైగా నిధులతో చేపట్టిన త్రాగునీటి సరఫరా, సివరేజ్ ప్లాంట్ల నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో 562 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు
*రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల పాటు రామగుండం నగరాన్ని అప్పటి పాలకులు నిర్లక్ష్యానికి గురి చేశారని అన్నారు. 800 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం గుర్తించి సంస్థ లాభాల్లో వాటా కింద బోనస్ అందించిందని అన్నారు. మేడిపల్లి లో పీపీఏ పద్దతులో విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
గతంలో వైఎస్ఆర్ 18 వేల నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేశారని, మరో 7 వేల పేదలకు పట్టాల పంపిణీ అవసరం ఉందని అన్నారు. రామగుండం నగరంలో మరో తహసిల్దార్ కార్యాలయం, జూనియర్ కళాశాల భవనం అవసరం ఉందని , వెంటనే మంజూరు చేయాలని కోరారు. ట్రాన్స్ జెండర్ సంక్షేమం కోసం ప్రభుత్వం మొదటి సారి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం అందించారని, నేడు మన రామగుండం లో మరో 50 మంది ట్రాన్స్ జెండర్ లకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
రామగుండం జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి మరో 50 కోట్ల మంజూరు చేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. వ్యాపార, వైద్య, పర్యాటక కేంద్రంగా రామగుండం అభివృద్ధి చేస్తామని తెలిపారు. రామగుండం లో దేవాలయాలను పురావస్తు శాఖ ద్వారా 12 కోట్ల అభివృద్ధి చేయాలని కోరారు.
నగరంలో నిర్మించిన 700 ఇండ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేశామని, పెండింగ్లో ఉన్న మరో 150 ఇండ్లకు నిదుర మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అంతర్గా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసామని, అదేవిధంగా ప్రభుత్వం పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 450 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, డిపిఆర్ తయారీ పనులు వేగవంతం చేయించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, డిసిపి రాంరెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ , పిడి హౌసింగ్ రాజేశ్వరరావు,ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







