- తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు
- కూటమిలోకి దినకరన్, విజయ్‌కాంత్ పార్టీ
- 23 న తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ
చెన్నై, మహా : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, ఎన్డీయే కూటమిలోకి కీలక పార్టీలు చేరుతున్నాయి. బుధవారం చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన టి.టి.వి దినకరన్, తన పార్టీ ఏఎంఎంకే అధికారికంగా ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు. పాత విభేదాలను పక్కనపెట్టి, రాష్ట్రంలో అవినీతిమయమైన డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తాము కలిసి పనిచేస్తామని దినకరన్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన నాయకులు ఒకే తాటిపైకి రావడం శుభపరిణామమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ హాజరుకానున్న భారీ బహిరంగ సభకు ముందే కూటమిని మరింత పటిష్టం చేసేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఈ కూటమిలో ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే , టీఎంసీ, ఐజేకే వంటి బలమైన శక్తులు ఉండగా, ఇప్పుడు ఏఎంఎంకే చేరికతో కూటమికి కొత్త ఊపు వచ్చింది. మరోవైపు, దివంగత విజయకాంత్ స్థాపించిన డీఎండీకే కూడా ఎన్డీయే గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రేమలత విజయకాంత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్యాడర్‌కు వెల్లడించారని, జనవరి 23న మోదీ బహిరంగసభ వేదికపై ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
చెంగల్పట్టు జిల్లా మదురాంతకం వద్ద జనవరి 23న జరగనున్న ఎన్డీయే మహాసభ ద్వారా కూటమి తన ఐక్యతను చాటనుంది. ఈ సభలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి , అన్బుమణి రామదాస్, టి.టి.వి దినకరన్ వంటి హేమాహేమీలు ప్రధాని మోదీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. రాష్ట్రంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలమైన పట్టున్న దినకరన్ రాక, కూటమి ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుతుందని అంచనా. వచ్చే ఎన్నికల్లో అటు అధికార డీఎంకే, ఇటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ టీవీకే పార్టీలను ఢీకొట్టేందుకు ఎన్డీయే సర్వసన్నద్ధమవుతోంది. ప్రధాని మోదీ పర్యటన కంటే ముందే సీట్ల సర్దుబాటు, మిత్రపక్షాల ఎంపిక వంటి కీలక ప్రక్రియలను పీయూష్ గోయల్ పర్యవేక్షిస్తున్నారు. తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను రక్షించే ప్రభుత్వమే ఎన్డీయే లక్ష్యమని నేతలు పేర్కొంటున్నారు. మొత్తానికి, మోదీ రాకకు ముందే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా ఎన్డీయేకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.








