- మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్
- ఇంచార్జీలను నియమించిన నితిన్ నబిన్
- మెజారిటీ మునిసిపాలిటీలపై ప్రత్యేక నజర్
- మహారాష్ట్ర తరహా వ్యూహానికి సన్నద్దం
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోసం ఇంఛార్జులను నియమించింది. ఈ మేరకు జాతీయ నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ఇన్ఛార్జ్గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, సహ ఇన్ఛార్జ్లుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మలను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ తెలంగాణలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ముందస్తుగానే ఇంఛార్జులను నియమించింది. రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేయటంతో పాటు మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికలుంటాయి. అయితే ముందుగానే జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్నారని ఇదే అదునుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి మెజార్టీ సీట్లను గెలవాలని భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో బీజేపీ రాణించలేకపోయింది. ఈ రెండు స్థానాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ లోనేవి. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యంత బలంగా బీజేపీ ఉన్నప్పటికీ ఈ రెండు ఉపఎన్నికల్లో ఢీలా పడిపోయిన పరిస్థితులు కనిపించాయి. వీటన్నింటిపై సమీక్షించిన పార్టీ అధినాయకత్వం రూట్ మార్చే పనిలో పడింది. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని చూస్తోంది. ఆలస్యం చేయకుండా ఇంఛార్జులను నియమించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లైంది.
అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిర్వహణతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇంఛార్జులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర – కేంద్ర నాయకత్వాల మధ్య సంప్రదింపులు జరుపుతూ కావాల్సిన సూచనలు చేసే అకాశం ఉంది. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెట్డటంతో పాటు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు కార్యాచరణను సిద్ధం చేయనుంది. మొత్తంగా ముంబై స్థానిక ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.








