Mahaa Daily Exclusive

  జాతీయ విపత్తులో ‘ఆపద మిత్ర’ల భాగస్వామ్యం కీలకం:కేంద్ర మంత్రి బండి

Share

  • జాతీయ విపత్తులో ‘ఆపద మిత్ర’ల భాగస్వామ్యం కీలకం
  • ‘ఆపద మిత్ర’ వలంటీర్ల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

న్యూఢిల్లీ, మహా : విపత్తులు ఏర్పడే సమయంలో ప్రజల చురుకైన భాగస్వామ్యం, ముందస్తు సంసిద్ధత, సమన్వయం ఎంతో కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగా ‘ఆపద మిత్ర’ వలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బలమైన, ప్రజా కేంద్రిత విపత్తు ప్రతిస్పందన వ్యవస్థ నిర్మాణానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విపత్తు ప్రమాద తగ్గింపు విషయంలోప్రధానమంత్రి ప్రతిపాదించిన పది అంశాల కార్యాచరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో ఎన్డీఎంఏ ఆధ్వర్యలో నిర్వహించిన ‘‘ఆపద మిత్ర’’ వలంటీర్ల సంభాషణ కార్యక్రమంతోపాటు యువర్ ఫ్రెండ్ (మీ నేస్తం) కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ఆపద మిత్ర ’ స్వచ్ఛంద సేవకులు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో దేశవ్యాప్తంగా నుండి హాజరైన 150 మంది ఆపదా మిత్ర్ స్వచ్ఛంద సేవకుల పాల్గొనడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడంతోపాటు సమాజ ఆధారిత విపత్తు సంసిద్ధత ఎంత కీలకమో జాతీయ స్థాయిలో వెలుగులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. ఆపద మిత్ర స్వచ్ఛంద సేవకుల సేవలను గుర్తిస్తూ ఐదుగురు ఆపద మిత్ర వలంటీర్లతో రాష్ట్రపతి భేటీ కావడంతోపాటు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రత్యేక శకటం పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. శోధన–రక్షణ, ప్రథమ చికిత్స, తరలింపు, సహాయక చర్యల్లో అవసరమైన నైపుణ్యాలతో సిద్ధంగా ఉండి, విపత్తు అనంతర కీలక తొలి గంటల్లో అధికారిక బలగాలు చేరకముందే ఆపద మిత్రలు ఎంతో మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షకుపైగా శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకులతో పాటు, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ, మై భారత్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ వంటి యువజన సంస్థల చురుకైన భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉందన్నారు. జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నేతృత్వంలో జాతీయ డిజిటల్ డేటా రిజిస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పటాకుల యూనిట్లు, ప్రధాన ప్రమాదకర పరిశ్రమలు, గనుల్లో పనిచేసే కార్మికుల డేటా సేకరణను సులభతరం చేసేలా మార్గదర్శకాలను రూపొందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

అంతకుముదు “మీ నేస్తం” వలంటీర్లతో పరస్పర సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రదర్శనను వీక్షించారు. యువర్ ఫ్రెండ్ వాలంటీర్లకు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేశారు. “డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్‌మెంట్” మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు, సముదాయ ఆధారిత వాలంటీరిజం కోసం “యూర్ ఫ్రెండ్” మోడల్‌ను ఆవిష్కరించారు. వాలంటీర్లు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, విజయాలను వివరించారు. విపత్తుల సమయంలో ప్రజల చురుకైన భాగస్వామ్యం, ముందస్తు సిద్ధత, సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు.