- ఖైదీల సేవలు, బీమా, ఉపాధి అవకాశాలు
- జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
- చంచల్‌గూడ జైల్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
హైదరాబాద్, మహా : తెలంగాణ జైళ్ల శాఖలో చేపట్టిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఖైదీల పునరావాసమే మా ప్రధాన లక్ష్యం అని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. చంచల్‌గూడలోని జైళ్ల శాఖ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జైలు అధికారులు, సిబ్బందికి పతకాలు అందజేయడమే కాక, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల శాఖ 2025లో చేపట్టిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. జైళ్లలోని పేద ఖైదీలకు లీగల్ ఎయిడ్ ద్వారా ఉచిత న్యాయసేవలు అందించగా, మొత్తం 6,573 ఖైదీలకు సహాయం అందించగా, 3,634 మంది విడుదలయ్యారని వివరించారు. అలాగే, ఖైదీలకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించారని, విడుదల అనంతరం మళ్లీ నేరాలకు దారి పడకుండా జైళ్లలో ఉపాధి శిక్షణ, ఉపాధి అవకాశాలను అందిస్తున్నారని తెలిపారు. ఖైదీల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేశామని కూడా స్పష్టం చేశారు. వేడుకలో జైళ్ల శాఖ ఐజీలు మురళీ బాబు, రాజేష్, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైలు సూపరింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, వెంకటలక్ష్మీ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.








