Mahaa Daily Exclusive

  సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్​లో ఘనంగా గణతంత్ర వేడుకలు..

Share

  • గ్లోబల్ స్కిల్​ హబ్​గా తెలంగాణ
  • గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్​లో ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్, మహా
మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ పేర్కొన్నారు. రైజింగ్ తెలంగాణ-2047 సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్​లోని పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమర జవాన్లకు గవర్నర్​, సైనికాధికారులు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల దృష్ట్యా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్, ప్రజా ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ డాక్యుమెంట్​ను ఆవిష్కరించిందని పేర్కొన్నారు. హైదరాబాద్​ ఇమేజ్​ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉందన్న ఆయన, రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా విభజించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్​ హబ్​గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తుందన్నారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చామని, ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు 62 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని వివరించారు.

భూ వివాదాల పరిష్కారానికి భూభారతి

భూ వివాదాలు పరిష్కరించే విధంగా భూభారతి చట్టం తెచ్చినట్లుగా గవర్నర్ వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ధాన్యానికి బోనస్​గా రైతులకు రూ.1,780 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్నవడ్లపై క్వింటాల్​కు రూ.500 చొప్పున బోనస్​ను చెల్లిస్తున్నామన్నారు. 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్​ బుక్​లో చోటు దక్కిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న గవర్నర్, మేడారం అభివృద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించామన్నారు.

విద్య, వైద్యం ప్రాధాన్యతలుగా

ప్రతి నియోజకవర్గానికి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నారని చెప్పారు. రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 27 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామన్న ఆయన, విద్య, వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతలుగా తీసుకుందని జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు. విద్యార్థులకు సమాన అవకాశాల కోసమే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. మహిళలు ఇప్పటికే రూ.200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని గవర్నర్ తెలిపారు. మహిళలను పెట్రోల్‌బంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామన్నారు. బ్యాంక్‌ రుణాల ద్వారా మహిళలకు రూ.40 వేల కోట్లు సమకూర్చామన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టామని వెల్లడించారు.

హ్యామ్​ విధానంలో రోడ్ల అభివృద్ధి

7,450 కి.మీ పంచాయతీ రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుందని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. తొలిదశలో రోడ్ల కోసం రూ. కోసం రూ.11,399 కోట్లు కేటాయించామన్నారు. హ్యామ్‌ విధానంలో 12 వేల కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లుగా వెల్లడించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. హిల్ట్‌ పాలసీ ద్వారా కాలుష్య పరిశ్రమలను సిటీ వెలుపలకు తరలించనున్నట్లుగా తెలిపారు. చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. 27 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నట్లుగా గవర్నర్ వివరించారు.