Mahaa Daily Exclusive

  భారత్ – ఈయూ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం: సామాన్యుడి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు అందరికీ లాభాలే!

Share

  • ఈయు డీల్ తో మస్తు లాభాలు
  • 27 దేశాలతో పెరగనున్న వాణిజ్యం
  • తగ్గనున్న కార్ల ధరలు.. చాక్లెట్ల ధరలు

మహా
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తో భారత్ – ఈయూ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. 27 దేశాలతో కూడిన ఈయూతో ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈయూతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదరడంతో మనకు వచ్చే లాభం ఏమిటి? మనకు మిగిలేది ఏమిటి?! చాక్లెట్లు, వైన్ నుంచి మొదలు లగ్జరీ కార్ల వరకు పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. ఆరు నుండి 8 మాసాల తర్వాత ఇవి అమలుకానున్నాయి.

భారత్ – ఈయూ ఎఫ్‌టీఏ హైలైట్స్

– ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈయూ. ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 25 శాతం (మూడింట ఒకవంతు) వాటా ఈ రెండు ఆర్థిక వ్యవస్థలదే. అందుకే ఈ రెండు పక్షాల నడుమ ట్రేడ్ డీల్ జరగడం ప్రపంచ మార్కెట్‌లో కీలక పరిణామం.
– స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌కు చెందిన వస్తు, ఉత్పత్తుల్లో 99 శాతానికిపైగా ప్రాధాన్యతా ప్రాతిపదికన ఈయూ మార్కెట్లోకి ప్రవేశాన్ని పొందుతాయి. ఈ అంశం భారతీయ వస్త్ర, లెదర్, మెరైన్, రత్నాలు, ఆభరణాల ఉత్పత్తుల పరిశ్రమలకు కలిసొస్తుంది. ఈ పరిశ్రమలు ఈయూకు ఏటా రూ.3 లక్షలు విలువైన ఎగుమతులు చేస్తుంటాయి.
– టెక్స్‌టైల్స్, దుస్తులు, వస్త్ర, మెరైన్ ఉత్పత్తులు, రసాయనాలు, ప్లాస్టిక్స్, రబ్బర్, లెదర్, పాదరక్షలు, లోహాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నీచర్, బొమ్మలు, క్రీడా వస్తువులను తయారుచేసే భారతీయ పరిశ్రమలకు ఈ డీల్ లబ్ధిని చేకూరుస్తుంది. ప్రస్తుతం వీటిపై ఈయూ దేశాలు 0 నుంచి 26 శాతం దాకా సుంకాలు విధిస్తున్నాయి.
– భారత్‌లో తయారయ్యే వస్త్రాలు, రసాయనాలు, పాదరక్షలు ఇకపై జీరో సుంకంతో ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతాయి. దీనివల్ల వాటిని వీలైనంత తక్కువ రేట్లకు అక్కడి మార్కెట్లో విక్రయించే వీలు కలుగుతుంది. ఫలితంగా భారత్‌లోని తయారీ పరిశ్రమల సేల్స్ పెరుగుతాయి. ఐరోపా నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతాయి.
– ఈయూ దేశాల నుంచి వచ్చే కార్లు, వైన్లపై భారత్ సుంకాలను కొంతమేర తగ్గించనుంది. వాహనాలు, ఉక్కు మినహా భారత్‌కు చెందిన అన్ని వస్తు,ఉత్పత్తులు జీరో సుంకంతో ఈయూ దేశాలలోకి ఎంట్రీని పొందుతాయి.

– భారత్‌కు చెందిన 93 శాతానికిపైగా వస్తు,ఉత్పత్తులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. మిగతా 6 శాతానికిపైగా భారతీయ వస్తు, ఉత్పత్తులపై కొంతమేర సుంకాన్ని ఈయూ తగ్గిస్తుంది. వాహనాలు వంటి వాటికి కోటా ఆధారిత పన్ను రాయితీలను కల్పిస్తుంది.

– ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చే తొలిరోజు నుంచే దాదాపు 90 శాతం భారత సరుకులపై దిగుమతి సుంకాన్ని ఈయూ తొలగిస్తుంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ డీల్ అమల్లోకి రానుంది. మిగతా 3 శాతం భారత సరుకులపై విడతలవారీగా ఏడేళ్లలోగా సుంకాలను తొలగిస్తుంది.
ఈయూ దేశాలకు చెందిన 93 శాతం వస్తు, ఉత్పత్తులకు జీరో సుంకంతో పదేళ్ల పాటు భారత్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చే తొలిరోజు నుంచి ఈయూకు చెందిన 30 శాతం వస్తు, ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారత్ తొలగిస్తుంది. ఈయూకు చెందిన 3.7 శాతం వస్తు, ఉత్పత్తులకు పన్ను రాయితీలు, కోటా ఆధారిత పన్ను తగ్గింపులను భారత్ ఇస్తుంది. మొత్తం మీద 97.5 శాతం ఈయూ సరుకులు ఎఫ్‌టీఏ పరిధిలోకి వస్తాయి.
– ఈయూ దేశాల్లోని 144 ఉప రంగాల్లోకి భారతీయ కంపెనీలు, పరిశ్రమలు ప్రవేశాన్ని పొందుతాయి. ఈ జాబితాలో ఐటీ సేవలు, ఐటీ ఆధారిత రంగాల సేవలు, ప్రొఫెషనల్ సర్వీసులు, విద్యాసేవలు ఉంటాయి. దీనివల్ల భారత టెకీలకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.
ఈయూ దేశాల్లోని 37 రంగాలు, ఉప రంగాలకు భారతీయ కంపెనీలు కాంట్రాక్ట్ సర్వీస్ సప్లయర్లుగా వ్యవహరించొచ్చు.
ఈయూలోని 17 రంగాలు, ఉప రంగాలకు భారతీయ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్ సేవలను అందించొచ్చు.

– భారత్‌లోని 102 ఉప రంగాల్లోకి ఈయూ దేశాల కంపెనీలకు ఎంట్రీ లభిస్తుంది. ఈయూ దేశాల వాహన బ్రాండ్లకు భారత్‌లోకి ప్రవేశం కల్పిస్తారు. భారత్‌లోనే వాహనాలు తయారుచేసే అవకాశాన్ని వాటికి కల్పిస్తారు.
– భారత్‌లో ఆయుర్వేద, సిద్ధ, యునానీ లాంటి కోర్సులు చేసిన వారు ఈయూ దేశాల్లోనూ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
సాంకేతిక, పారిశ్రామిక నైపుణ్యాలు కలిగిన భారతీయ యువత, ప్రొఫెషనల్స్‌కు ఈయూ దేశాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే అంశం కూడా ట్రేడ్ డీల్‌లో ఉంది.
– పోస్ట్ డ్యూటీ వర్క్ వీసాలపైనా ఈయూ నుంచి భారత్ హామీని పొందింది. దీని ప్రకారం, భారత విద్యార్థులు ఈయూ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాక, నిర్దిష్ట కాలం పాటు అక్కడే ఉండొచ్చు. ఆ వ్యవధిలో ఉద్యోగం చేయొచ్చు. కెరీర్ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఈయూలోనే స్థిరపడేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవచ్చు.

– ఈయూతో భారత్ జట్టు కట్టడం వల్ల ఎగుమతి, తయారీ, సేవారంగాల్లోని భారతీయ ఎంఎస్‌ఎంఈ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. మహిళలు, హస్త కళాకారులు, యువత, ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించే దిశగా భారత్, ఈయూ దేశాలు చొరవ చూపనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నాయి.

– వాహన ఎగుమతుల విభాగంలో భారత్‌తో ఒప్పందానికి ఈయూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఈయూ దేశాల్లో కార్ల రేట్లు సగటున రూ.25 లక్షలకుపైనే ఉంటాయి. కానీ భారత్‌లో రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు రేట్ల కార్లే ఎక్కువగా సేల్ అవుతుంటాయి. అందుకే భారత్‌లో కార్ల తయారీ విభాగంలోకి ప్రవేశించాలనే ఆసక్తిని ఈయూ వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈయూ దేశాల వాహనాలపై భారత్ 66 నుంచి 125 శాతం సుంకాన్ని విధిస్తోంది. వాహనాలపై కోటా ప్రాతిపదికన పన్ను రాయితీలను ఇవ్వాలనే అంశంపై ఇరుపక్షాలు చర్చించాయి.

– ఈయూ, భారత్‌లలోని కార్పొరేట్ కంపెనీలు పరస్పరం నిపుణులు, ఉద్యోగులను బదిలీ చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇరువైపులా బిజినెస్ విజిటర్లకు అనుమతులను మంజూరు చేస్తారు. భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఈయూ పౌరులు, ఈయూ దేశాల్లో జాబ్స్ చేస్తున్న భారతీయుల కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని ఇస్తారు.