- కాంట్రాక్టర్లపై ఒత్తిడి
- తప్పుడు ఎస్టిమేట్లతో జీహెచ్‌ఎంసీకి నష్టం
- కూకట్ పల్లి ఎస్ఈ చిన్నారెడ్డిపై కాంట్రాక్టర్ ఆరోపణలు
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా, మహా : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కూక’ట్ పల్లి జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి తప్పుడు ఎస్టిమేట్లు రూపొందించి జీహెచ్‌ఎంసీ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని, కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంట్రాక్టర్ సంగిశెట్టి రవీందర్ సాగర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూకట్ పల్లి జోన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకూ అధికారులు ఒకే విధంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ముడుపులు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. తప్పుడు ఎస్టిమేట్లు, డివియేషన్‌ల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే సంబంధిత అధికారి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. బీటీ కటింగ్, సీసీ రోడ్డు కటింగ్ పనులు యంత్రాలతో చేయాల్సిన చోట మానవ శ్రమతో చేస్తారంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రవీందర్ సాగర్ అన్నారు. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్ల పేరిట వేసిన రోడ్లను తొలగించి కార్టింగ్‌కు పది కిలోమీటర్ల లీడ్ ఎస్టిమేట్‌లో చూపించడం వాస్తవానికి విరుద్ధమని చెప్పారు. డిస్మాంట్లింగ్ తరలింపు కోసం 25–30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ 10 కిలోమీటర్ల లీడ్ చూపించడం కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడానికేనని విమర్శించారు. ఈ ఎస్టిమేట్‌లపై ప్రశ్నించగా “ఇతర కాంట్రాక్టర్లు చేస్తున్నారు కదా, మీరూ అలాగే చేయాలి” అని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా చేసిన పనులకు డివియేషన్‌ల పేరుతో జీహెచ్‌ఎంసీ నిధులను ఇంజనీరింగ్ అధికారులు స్వలాభానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.ఈ అంశాలపై విజిలెన్స్ అధికారులు, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ రవీందర్ సాగర్ డిమాండ్ చేశారు.








