Mahaa Daily Exclusive

  ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..! అశ్రునయనాలతో అభిమానుల వీడ్కోలు..

Share

  • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
  • అశ్రునయనాలతో అభిమానుల వీడ్కోలు
  • హాజరైన కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ

 

బారామతి, మహా : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో రాష్ట్ర లాంఛనాలతో పూర్తయ్యాయి. ఉదయం ప్రారంభమైన అంతిమ యాత్రలో వేల మంది అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ మంత్రి నారా లోకేష్ సహా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. బుధవారం బారామతి విమానాశ్రయం దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (66) మరణించారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి పుణ్యశ్లోక అహిల్యాదేవి ఆస్పత్రి నుంచి కాటేవాడి‌లోని ఇంటికి తరలించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు విద్యా ప్రతిష్ఠాన్ క్యాంపస్ నుంచి అంతిమ యాత్ర మొదలైంది. పూలతో అలంకరించిన రథంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. నగరంలోని ప్రధాన రోడ్ల గుండా ఈ యాత్ర సాగింది. “అజిత్ దాదా అమర్ రహే” అంటూ అభిమానులు నినాదాలు చేశారు.

 

తర్వాత మృతదేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌కు చేర్చారు. అక్కడ రాష్ట్ర లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. అజిత్ పవార్ కుమారులు చివరి క్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శరద్ పవార్, సుప్రియా సూలే సహా అన్ని పార్టీల నేతలూ పాల్గొన్నారు. బారామతి నగరమంతా అభిమానులతో నిండిపోయింది. రోడ్లపై జనసముద్రం కనిపించింది. ఓ దశలో జనాన్ని కంట్రోల్ చెయ్యలేం అని అనుకున్న పోలీసులు.. యాత్రా మార్గంలో కొన్ని మార్పులు కూడా చేశారు.

 

మొదలైన డీజీసీఏ, ఏఏఐబీ దర్యాప్తు

 

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటుగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరోవైపు విమాన ప్రమాదంపై డీజీసీఏ, ఏఏఐబీ దర్యాప్తు మొదలైంది. బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన పొగమంచు, విజిబులిటీ తక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. ఐతే.. దర్యాప్తు తర్వాత పూర్తి నివేదిక వస్తుంది. అందులో ఏం చెబుతారన్నది తేలాల్సిన అంశం.

 

అజిత్ పవార్ మామూలు నేత కాదు. బారామతి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దిగ్గజ నేత. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఓ దశలో ఆయన మహారాష్ట్ర సీఎం కూడా అయ్యేవారు. ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ నిరంతరం గెలుపు వైపు అడుగులు వెయ్యడంలో అజిత్ పవార్ తనదైన ముద్ర వేశారు. అంతేకాదు ఎన్సీపీని, శరద్ పవార్ నుంచి విడగొట్టి మరీ తన పట్టును నిలుపుకున్న వ్యూహాత్మక నేత. ఆయన మరణంతో మహారాష్ట్రలో మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలు ప్రకటించారు. బారామతి పట్టణమంతా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఐతే ఆయనది ప్రమాద మరణమా, లేక కుట్ర పూరిత హత్యా అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై పూర్తి రిపోర్ట్ వచ్చాక గానీ ఏం జరిగిందో తెలియదు.