పరిగి మహా : వికారాబాద్ జిల్లాలో జరగనున్న నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం, అవాస్తవ వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలను విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే మెసేజ్‌లు, వీడియోలు, పోస్టులను ప్రోత్సహించవద్దని సూచించారు. ఏ సమాచారాన్నైనా ఇతరులకు ఫార్వార్డ్ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని, అభ్యంతరకర కంటెంట్ విషయంలో గ్రూపు అడ్మిన్లు తక్షణమే వాటిని తొలగించాలని తెలిపారు. జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.








