- కార్యకర్తలకే కమలం పెద్ద పీట
- 80 శాతం మంది కార్యకర్తలకే కార్పొరేటర్ టిక్కెట్లు
- సర్వే నివేదికల ఆధారంగా టిక్కెట్లు ఖరారు చేసిన త్రిసభ్య కమిటీ
- 66 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం
కరీంనగర్, మహా: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మొత్తం 66 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు విడుదల చేశారు. అభ్యర్థుల జాబితాను విశ్లేషిస్తే 80 శాతం మంది కార్యకర్తలకే టిక్కెట్లు దక్కాయి. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారమంతా ఒట్టిదేనని తేలిపోయింది. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే ఈ సారి పెద్ద పీట వేయడం గమనార్హం. గెలిచే అవకాశం లేని డివిజన్లలో మాత్రమే ఇతర పార్టీల నుండి వచ్చిన మాజీ కార్పొరేటర్లకు, ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులకు టిక్కెట్లను కేటాయించారు. టిక్కెట్ల కేటాయింపులో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు, ఓదేలు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించారు. అదే సమయంలో ఎవరికి టిక్కెట్లు కేటాయించాలనే అంశంపై డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించారు. వివిధ సర్వే ఏజన్సీల ద్వారా వచ్చిన నివేదికలతోపాటు కార్యకర్తల పనితీరును పరిగణలోకి తీసుకుని గత వారం రోజుల నుండి డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను స్ర్కూటినీ చేసిన త్రిసభ్య కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పంపింది. ఆ జాబితాను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు జాబితాను అధికారికంగా చేశారు.








