- టీటీడీ కల్తీ నెయ్యి కేసు
- సూత్రధారుల కోసం విచారణ కమిటీ
- ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం
- కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు కేసు అప్పగింత
- అసలు సూత్రదారులను సిట్ గుర్తించలేదని అభిప్రాయపడ్డ మంత్రివర్గం
- ఏజీతో పాటు పలువురు సీనియర్ అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న కేబినెట్
అమరావతి, మహా : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు విషయంలో సిట్ చేసిన సిఫారసులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించాలని నిర్ణయించింది. కల్తీ సూత్రధారులు ఎవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా ప్రతినిధులతో వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సిట్ ఇప్పటికే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని, అందులోని పూర్తి వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికీ కొన్ని సిఫారసులు చేసిందన్నారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను నీరుగార్చి, కల్తీకి పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, అందుబాటులో ఉన్న ఆధారాలతోనే ఆ రోజు మాట్లాడారని స్పష్టం చేశారు.
లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఎస్-వాల్యూ లో తేడాలు రావడం వల్లే ఎన్‌డిడిబికి అనుమానం కలిగిందని, పరీక్షల్లో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లార్డ్ ఉన్నట్లు తేలిందని మంత్రి స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2022లోనే దీనిపై నివేదిక వచ్చినా, అప్పటి వైసీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఆ విషయాన్ని తొక్కిపెట్టాయని ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి సేకరణలో ఉన్న మూడు కఠిన నిబంధనలను వైసీపీ ప్రభుత్వం కావాలనే తొలగించిందని, ఇందులో దుర్మార్గమైన కుట్ర దాగి ఉందన్నారు.
బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలే బాబా వంటి సంస్థలు, వైష్ణవి డైరీ పేరుతో మరో సంస్థతో టైఅప్ పెట్టుకుని నకిలీ పత్రాలతో కాంట్రాక్టు దక్కించుకున్నాయని పయ్యావుల వెల్లడించారు. టెండర్ల సమయంలో అధికారులు కళ్ళు మూసుకుని వీరికి సహకరించారని, పామాయిల్ అధిక మొత్తంలో కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ఆధారాలు లభించాయని తెలిపారు. వైష్ణవి డైరీ సమర్పించినవన్నీ ఫేక్ డాక్యుమెంట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కల్తీలో అప్పటి టీటీడీ చైర్మన్లు, అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ రిపోర్ట్ సిఫార్సు చేసిందని ఇందులో భాగంగా బాలాజీ, అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. వీరితో పాటు వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలను కూడా నేరస్తులుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే వీరందరిని విచారించడానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు కేసు అప్పగింత
సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి, అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. అప్పట్లో పర్చేస్ కమిటీకి సభ్యులు కాని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు. అయితే, ఆనాడు కమిటీ సభ్యులుగా ఉన్న తనను, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని పిలవలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్‌లో అధికారులు పేర్కొన్నారు. నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్ దక్కించుకున్నారని, టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ ఈఓగా ఉన్న సింఘాల్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా పట్టించుకోకపోవడంపైనా చర్చించారు. అప్పటి అధికారులు బాలాజీ, సుబ్రహ్మణ్యం దానిని పక్కన పెట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలిందని, అదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రులు తెలిపారు. సిట్ నివేదికలో కొంతమంది పేర్లు పేర్కొన్నప్పటికీ, చివరి ఫైండింగ్స్‌లో వాటిని పేర్కొనకపోవడంపై చర్చ జరిగింది. ఈ లోపాలన్నింటిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించింది.
టెండర్ ప్రక్రియలో లోపాలపై దృష్టి సారించాలని కమిటీకి మంత్రిమండలి సూచించింది. సహకార డెయిరీలను పక్కన పెట్టేందుకు పథకం రూపొందించారని కేబినెట్ పేర్కొంది. సహకార డెయిరీలను పక్కన పెట్టడం ద్వారా బోగస్ డెయిరీలను రంగంలోకి తీసుకువచ్చారని అధికారులు వివరించారు. దీనిపైనా ఎంక్వైరీ కమిటీ దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. అడ్వకేట్ జనరల్, సీనియర్ అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పాత్ర గురించి సిట్ నివేదికలో ఏమైనా పేర్కొన్నారా? అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఛార్జ్‌షీట్‌లో యానిమల్ ఫ్యాట్ ఉందని పేర్కొన్నారా? అని కూడా పవన్ అడిగారు. ఛార్జ్‌షీట్‌లోని 35వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారని పవన్‌కు అధికారులు చెప్పారు
అసలు సూత్రధారులను వెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సిట్ నివేదికలో లోపాలున్నాయని, అసలు సూత్రధారులను బయటకు తీసుకురాలేకపోయిందని మంత్రులు పేర్కొన్నారు. అందువల్ల వెంటనే అసలు సూత్రధారులపై ఫోకస్ పెట్టాలని మంత్రులు చెప్పారు. ఈ విషయాలను బహిర్గతం చేసేందుకే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించారు.







