- ఉచితాలకే బడ్జెట్ అనుకోవడంసరికాదు
- కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు భారీ నిధులు
- రైల్వే హబ్ గా మారనున్న రాష్ట్రం
- ‘హబ్స్ ఆఫ్ హబ్ గా హైద్రాబాద్’
- త్వరలోనే హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ మూడో ఫేజ్‌కు మోడీ భూమి పూజ
- మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర బడ్జెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా ‘వికసిత్ భారత్’ కోసం రూపొందించిన బడ్జెట్ ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిధులేమీ లేవంటూ మంత్రులు, విపక్షంలోని కొంత మంది నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బడ్జెట్ సమగ్ర స్వరూపం పరిశీలించి నిధుల కేటాయింపును పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత బాధ్యత కలిగిన నేతలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేస్తారని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు పీఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించామని పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేశామని తెలిపారు. కొమురవెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 5 వందే భారత్, 2 అమృత్ భారత్ రైళ్లను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. రూ.5.50 లక్షల కోట్లతో 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
గత 12 ఏళ్లుగా నరేంద్రమోదీ హయాంలోని ప్రభుత్వం ప్రజలకు చెప్పే వాటినే చేస్తూ పాలన సాగిస్తోందన్నారు. ఈసారి బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ ను తీర్చిదిద్దే లక్ష్యంలో ఈ బడ్జెట్ మరొక ముందడుగు అని చెప్పొచ్చన్నారు.
యువతకు, గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు, పరిశోధనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షకు రెక్కలు తొడిగే బడ్జెట్ ఇది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక పరిశోధకులు, మేధావులు, అవగాహన కలిగిన వారి మన్ననలు పొందిన బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారన్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు. ఐటీ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, డిజిటల్ హబ్, హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్, సెమీ కండక్టర్ హబ్, డేటా సెంటర్ హబ్, మెడికల్ హబ్, ఇలా హైదరాబాద్.. ‘హబ్స్ ఆఫ్ హబ్ హైద్రాబాద్’ త్రిబుల్ హెచ్ గా అవతరించిందన్నారు.
తెలంగాణలో ఉన్న 23 లక్షల ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందని,
వచ్చే ఐదేళ్ల కోసం రూ.10వేల కోట్లతో ప్రకటించిన బయోఫార్మా శక్తి (స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్) కార్యక్రమం ద్వారా ఫార్మా కేపిటల్ గా ఉన్న మన హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుందని వివరించారు. ఈ పథకం కింద దేశంలో 3 కొత్త నిపర్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్) సంస్థలను ఏర్పాటు చేయనున్నారన్నారు. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ కి సంబంధించిన నిధులు కూడా పెరగనున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై లేనిపోని ఆరోపణలు చేసిందని, ఇందుకు భిన్నంగా 2025-26లో రూ.88వేల కోట్లు ఉన్న ఉపాధి హామీ పథకం బడ్జెట్.. 2026-27 సంవత్సరానికి రూ.96 వేల కోట్లకు పెరిగిందని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో సంబంధం లేకుండా ఎరువులను రైతులకు భారీ సబ్సిడీ అందజేస్తున్నామని, టెక్స్-ఇకో కార్యక్రమం ద్వారా.. టెక్స్టైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీకి తగ్గట్లుగా భారతీయ వస్త్ర పరిశ్రమ ఎదిగేందుకు కేంద్రం సహకరించనుందన్నారు. ఇప్పటికే తెలంగాణకు ప్రకటించిన ‘కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్’కు ఈ పథకం ద్వారా మరింత లబ్ధి చేకూరనుందని మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణలోని 33 జిల్లాలకు ఒక్కో గర్ల్స్ హాస్టల్ రానుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద తెలంగాణకు 1.3 లక్షల ఇళ్లకు ఇంటికి రూ. లక్షన్నర చొప్పున రూ.2,190 కోట్లు కేటాయించనుందని, ప్రధానమంత్రి అవాస్ యోజన-రూరల్ లో భాగంగా తెలంగాణకు ఇంటికి.. రూ.72 వేల చొప్పున 3 లక్షల ఇళ్ల కోసం రూ.2,160 కోట్లు కేటాయించనుందన్నారు.
హైదరాబాద్‌లో అటామిక్ మినరల్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.406 కోట్లు, ఏఆర్ సీఐ (ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్), సీడీఎఫ్ డీ (సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ లాంటి కేంద్ర సంస్థలకు సుమారు రూ.3 వేల కోట్లు కేటయించారన్నారు. తెలంగాణలో దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని, రూ.2,471.76 కోట్ల వ్యయంతో 64 కిలోమీటర్ల పొడవున ఆర్మూర్- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందన్నారు. రూ.2,484 కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల మేర జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారి నిర్మించనున్నారన్నారు. రూ.2,730 కోట్ల ఖర్చుతో 68 కిలోమీటర్ల పొడవున 4 లేన్లతో ఆర్మూరు- జగిత్యాల- మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని తెలిపారు. రూ.3,175 కోట్ల వ్యయంతో మహబూబ్‌నగర్–గూడెబళ్లూరు మధ్య 80 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ చేపట్టనున్నారని, 231 కిలోమీటర్ల మేర ఆరు లేన్లతో హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.10,297 కోట్లతో రహదారి నిర్మించనున్నారన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగం)కు రూ.21,629 కోట్లను కేంద్రం కేటాయించిందని, మొత్తం తెలంగాణలో రూ.42 వేల కోట్ల నిధులతో కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులకు పెద్ద పీట
రైల్వేకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా హైదరాబాద్ కు ప్రాజెక్టులు కేటాయించడం జరిగిందని, 2009-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల కోసం అప్పటి ప్రభుత్వం రూ.886 కోట్లు కేటాయిస్తే తాజా బడ్జెట్లో ఏకంగా 6 రెట్లు అధికంగా రూ.5,454 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అమృత్ భారత్ పథకం ద్వారా 42 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారన్నారు. వాటిలో ఇప్పటికే 5 స్టేషన్లు పూర్తి అయ్యాయని, అందులో బేగంపేట, కరీంనగర్, వరంగల్, చర్లపల్లి స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందన్నారు. త్వరలోనే కొమురవెల్లి మల్లన్న, జోగులాంబ రైల్వే స్టేషన్లు కూడా పూర్తికానున్నాయని, 2026లో 30 కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని తెలిపారు. తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లు కేటాయించారని, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 900 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం పూర్తయితే 2014 నుంచి ఇప్పటివరకు 1,115 కిలోమీటర్ల మేర రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయని వివరించారు. దీంతో తెలంగాణలోని రైల్వే ట్రాక్‌లకు 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధ్యమైందన్నారు. తెలంగాణలో మొత్తం 1242 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లలో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు మంజూరు కాగా, ఇప్పటి వరకు 627 కిలోమీటర్ల మేర పూర్తి అయింది. 410 కిలోమీటర్ల మేర పనులు త్వరలోనే పూర్తికానున్నాయి. దేశంలో 7 హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు మన హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయని, అవి హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై అని వివరించారు. ఈ కారిడార్లతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. ఇందుకోసం రూ.లక్షా 51వేల కోట్లను కేంద్రం ఖర్చుచేయనుందన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు కేవలం 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చని, ఇందుకోసం రూ. లక్షా 90వేల కోట్లను కేంద్రం ఖర్చుచేయనుందన్నారు.
హైదరాబాద్ నుంచి పుణే వరకు కేవలం గంటా 55 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు తెలంగాణకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందని తెలిపారు.
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఒడిదొడుకులు ఉన్నాభారత్ మాత్రం నరేంద్ర మోదీ నేతృత్వంలో నిలకడగా అభివృద్ధి చెందుతోందని, అనేక దేశాలకు మన దేశ ఆర్థిక స్థితి పట్ల నమ్మకం కుదిరి.. పెట్టబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, తద్వారా హైదరాబాద్ లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు. 2006-27 బడ్జెట్ ను దీర్ఘకాలికంగా దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా రూపొందించామని, అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమదృష్టితో చూస్తూ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. మేడారానికి 3 కోట్లకు పైగా నిధులను కేంద్రప్రభుత్వం కేటాయించింది. గతంలో 20 లక్షలు కూడా ఉండకపోయేదన్నారు.








