- ఫోన్ ట్యాపింగ్ కేసు
- ప్రణీత్ రావుకు డిమోషన్
- డీఎస్పీ నుంచి సీఐగా నియమిస్తూ ఆదేశాలు జారీ
హైదరాబాద్, మహా : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దుగ్యాల ప్రణీత్ రావు హోదాను తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక పోలీసు అధికారిని డీఎస్పీ హోదా నుంచి సీఐగా డిమోట్ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో పనిచేసిన ప్రణీత్ రావు, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావుకు గత కేసీఆర్ ప్రభుత్వం యాక్సిలరేటెడ్ పదోన్నతి కింద డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది. అయితే, ప్రొబేషన్ కాలంలోనే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో ఆయనకు గతంలో ఇచ్చిన ఆ పదోన్నతిని రద్దు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ నివేదిక ప్రాథమిక సమాచారం ప్రకారం, 2023 నవంబర్ 15న ఒక్కరోజే దాదాపు 650 ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని డేటాను, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తోంది. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. తాజా డిమోషన్ ఉత్తర్వులతో ప్రణీత్ రావు ఇకపై ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు.
కీలక దశకు చేరుకున్న ట్యాపింగ్ కేసు విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, మరియు హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ఇటీవల వేరు వేరు రోజుల్లో వారిని విచారించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, పార్టీకి చెందిన కొందరు నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే అభియోగాలపై ఈ విచారణ సాగింది. నిబంధనలకు విరుద్ధంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంలో వీరి పాత్ర ఏమిటనే కోణంలో అధికారులు ప్రశ్నించారు.
విచారణ సందర్భంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇటీవల అరెస్ట్ చేసిన ఎస్ఐబీ పోలీసు అధికారుల వాంగ్మూలాలను వీరి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎన్నికల సమయంలో నిధుల తరలింపును పర్యవేక్షించడానికి, ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలపై క్లారిటీ కోరారు. అయితే, నోటీసులు అందుకున్న నేతలు ఈ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపుగా కొట్టిపారేస్తూ, చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. ఈ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మరికొంత మంది కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.








