- మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం
- బీజేపీ తరపున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం
- పవన్ కళ్యాణ్‌ను కలిసిన కిషన్ రెడ్డి, రాంచందర్ రావు
- 7, 8 తేదీలలో ప్రచారానికి రానున్న పవన్
హైదరాబాద్, మహా : మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏలో తమ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
పవన్ కళ్యాణ్‌తో బీజేపీ కీలక నేతలు భేటీ
తెలంగాణ బిజెపి ముఖ్య నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఇరుపార్టీల రాజకీయ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అభివృద్ధి అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. జనసేనాని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను కోరారు. జనేసేన, బీజేపీ నేతల మధ్య సమన్వయం ద్వారా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో బిజెపికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని తెలిపారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటించారు. ఈ పొత్తు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.
ట్వీట్టర్ వేదికగా బీజేపీ ప్రకటన
పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారని, ఎన్నికల ప్రచారానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి ప్రచారం తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.








