- మిర్చి ధర ఘాటు
- పసిడితో పోటీపడుతున్న ఎర్ర బంగారం ధర
- క్విటాకు రూ. 41 వేలు దాటిన మిర్చీ ధర
హైదరాబాద్, మహా : బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు దడ పుట్టిస్తుంటే.. వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబరపడుతున్నారు. ఎప్పుడూ మిర్చి పంట వేసి నష్టాలను చవిచూస్తున్న రైతన్నలు.. ప్రస్తుతం ఎగబాకుతున్న మిర్చి ధరలు చూసి నివ్వెరబోతున్నారు. ఈ ఏడాది మిర్చి రైతులకు కాసుల పంటే అని ఆనందంతో మురిసిపోతున్నారు. తెలంగాణలో దేశీ రకం మిర్చి ఇప్పటికే 41 వేల రూపాయల మైలు రాయిని దాటింది. వరంగల్ లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ రకం టమాటా మిర్చి ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు ధర పలికింది.. క్వింటా దేశీరకం మిర్చి 41,200 రూపాయలు ధర పలుకుతుంది. మరోవైపు ఎల్లో మిర్చి (పసుపు రకం మిరపకాయలు) క్వింటా 44 వేల రూపాయలు పలుకుతుంది. వండర్ హాట్ మిర్చి రకానికి కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది.. మంగళవారం క్వింటా రూ.32,000 రూపాయలు పలికిన వండర్ హాట్ మిర్చి ధర ఒక్కరోజులోనే ఐదు వేలు పెరిగింది. బుధవారం క్వింటా వండర్ హాట్ మిర్చి ధర రూ.37,100 కు పెరిగింది. ఈ రకం మిర్చికి ఉన్న ఘాటు, రంగు కారణంగా మసాలా కంపెనీల నుండి భారీ ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా అన్నిరకాల మిర్చి ధరలు పసిడితో పోటీపడి పైపైకి ఎగబాకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధరలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో పాటు మధ్యప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో మిర్చి సాగు తగ్గడం వల్ల ఇక్కడ మిర్చికి ఫుల్ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు, అధికారులు అంటున్నారు.. గత రెండేళ్లుగా సరైన ధరలు లేక ఆందోళన చెందిన రైతులకు.. ఇప్పుడు పసిడితో పోటీపడుతున్న మిర్చి ధరలు కాస్త ఊరట నిస్తున్నాయి.








