Mahaa Daily Exclusive

  పాత జిల్లాలు రద్దు చేయం.. కొత్తవి ఏర్పాటు చేయం: భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

Share

  • పాత జిల్లాలు రద్దు చేయం
  • కొత్త జిల్లాలు ఏర్పాటు చేయం
  • తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
  • భూపాలపల్లి జిల్లా రద్దు కాదు.. సింగరేణి బోర్డు కూడా రద్దు కాదు
  • కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి

భూపాలపల్లి, మహా : పాత జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పునర్‌వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందని తెలిపారు. బహిరంగంగా ప్రజల సూచనలు తీసుకునే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన- ప్రగతిబాట’ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని పునరుద్ఘాటించారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దంటూ ప్రజలకు సీఎం రేవంత్‌ సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ ఆ పార్టీ నేతలను హెచ్చరించారు. కొందరికి విషం చిమ్మడమే పనిగా మారిందంటూ విపక్షాలపై కారాలు మిరియాలు నూరారు. కార్మికులకు నష్టం కలిగే ఏ పనీ చేయబోమన్నారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు.. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారంటూ విపక్ష పార్టీలోని అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు. పదేళ్లలో వందల, వేల ఎకరాలు సంపాదించుకున్నారని సదరు నేతలపై నిప్పులు చెరిగారు. పేదల ఆత్మగౌరవం కోసం పని చేయలేదంటూ కేసీఆర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బాగుకోసం కేసీఆర్‌ ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. తమ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందన్నారు. తెలంగాణలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.

ఏప్రిల్ లో రెండో విడత ఇళ్ళు

ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్ల వ్యయం అవుతుందని సీఎం రేవంత్‌ వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.100కోట్లతో మేడారం అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన జాతరలో సమ్మక్క-సారలమ్మను 2 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత పిట్టకథలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదు కానీ.. ఎర్రవల్లిలో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌ మాత్రం వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేనే లేదని కుండ బద్దలు కొట్టారు. కేసీఆర్‌, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతామంటూ భూపాలపల్లి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అధికారంలో ఉన్న మమ్మల్ని చూసి ఓటు వేయండంటూ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల్లో పనులు చేసేది కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రూ.6,116 కోట్లతో వరంగల్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపడతామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కల్వకుంట్ల కుటుంబానికే పదవులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు.. తనను ఏ పేరుతో పిలిచినా ఫర్వాలేదన్నారు. కానీ మీ పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మాత్రం కిషన్ రావు అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతున్నది బీజేపీ కాదా? అంటూ ఆ పార్టీ నేతలను సీఎం రేవంత్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా? అంటూ బీజేపీ అగ్రనేతలకు సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. మరీ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్‌, హరీశ్, కేటీఆర్‌‌లు అరెస్టు కాకుండా ఎవరు అడ్డుపడుతున్నారంటూ సందేహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ను సీబీఐ ఎందుకు పిలవట్లే?

కాళేశ్వరంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. మరి ఆ కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదంటూ సీఎం రేవంత్‌.. బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్‌ను అరెస్టు చేసే వరకు కిషన్‌రెడ్డిని కిషన్‌రావే అని పిలుస్తారంటూ సీఎం రేవంత్ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌కు కేటీఆర్‌ దొంగపుత్రుడైతే.. కిషన్‌రెడ్డి దత్తపుత్రుడు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో రూ.వేల కోట్లు సంపాదించారంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే బిల్డర్లు, రియల్టర్లను బెదిరించి.. ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే.. బ్లాక్‌మెయిల్‌ రాజకీయ సమితి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఇవాళ్టి నుంచి ఆ పేరుతోనే పిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
………….

Latest