Mahaa Daily Exclusive

  పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి మార్క్ పాలిటిక్స్: ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్‌కు భారీ షాక్!

Share

  • పటాన్ చెరువు నియోజకవర్గంలో
  • చక్రం తిప్పిన గూడెం
  • ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా

హైదరాబాద్, మహా : పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చక్రం తిప్పారు. బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకున్న మహిపాల్ రెడ్డి మున్సిపాల్ ఎన్నికల ముందు తిరిగి బీఆర్ఎస్ వైపుమళ్లి తానంటే ఏమిటో నిరూపించి చూపారు. కాంగ్రెస్ లో చేరడం వల్ల పైసా లాభం జరగలేదన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. అన్నట్లుగానే నియోజకవర్గంలో ఆయన చక్రం తిప్పి చూపారు. పటాన్ చెరువు నియోజక వర్గం పరిధిలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉండగా ఐదింట్లోనూ బీఆర్ఎస్ ఘననీయమైన సీట్లు సొంతం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఐదు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు దక్కలేదు. గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌ కైవసం అయ్యాయి. గుమ్మడిదలలో బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుపొందింది. గడ్డపోతారంలో కూడా స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ విజయం సాధించడం గమనార్హం. మిగిలిన మూడు మున్సిపాలిటీలైన ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలోనూ బీఆర్‌ఎస్‌కు అత్యధిక వార్డులు దక్కాయి.

ఇస్నాపూర్ లో..

కాగా ఇస్నాపూర్‌లో మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్-10, బీఆర్‌ఎస్‌-12, 4 గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ కావాలంటే బీఆర్ఎస్ కు 2 సీట్లు, కాంగ్రెస్ కు 4 సీట్ల అవసరం ఉన్నాయి. దీంతో రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో పడ్డాయి. ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రం నుంచి నుంచి నేరుగా క్యాంపులకు తరలించేందుకు ఆ రెండు పార్టీల నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇస్నాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే మహిపాల్ రెడ్డి జోక్యంతో ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కే దక్కే అవకావం ఉందని తెలుస్తోంది.

జిన్నారంలో

జిన్నారంలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 8 వార్డుల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 6 వార్డులు, బీజేపీ 4 వార్డులు, స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డుల్లో విజయం సాధించారు. అయితే ఇక్కడ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో జిన్నారంలో త్రికోణ పోటీ ఏర్పడింది. అయితే అత్యధిక స్థానాలు బీఆర్ఎస్‌కే దక్కాయి కనుక ఇండిపెండెట్లు వారికి మద్దతు ఇస్తే పదికి చేరుతుంది. అదే సమయంలో ఎక్స్ ఆఫీషీయో ఓటు ద్వారా బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

కాగా పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆయా మున్సిపాలిటీల్లో చక్రం తిప్పారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే అనుచరులుఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో చేరకుండానే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్‌ఎస్ గెలుపునకు విస్తృతంగా కృషి చేశారని చెబుతున్నారు. ఆయన మద్దతుతోనే బీఆర్‌ఎస్ ఈ ఐదు మున్సిపాలిటీల్లో ఆధిపత్యం సాధించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Latest