Mahaa Daily Exclusive

  జనగామలో ‘హంగ్’ కలకలం: మున్సిపల్ పీఠం కోసం పట్టుబడుతున్న కింగ్ మేకర్ పాండు!

Share

  • జనగామలో హంగ్
  • ఛైర్మన్ పదవి ఇస్తే మద్ధతిస్తానంటున్న స్వతంత్ర అభ్యర్థి
  • తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

జనగామ, మహా : మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. హంగ్ సూచనలు కనిపించిన మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్‌లకు అన్ని పార్టీలు గాలం వేస్తున్నాయి. ఛైర్‌పర్సన్ పీఠం కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన పార్టీలు.. అభ్యర్థులు చేజారిపోకుండా వారిని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా కౌంటింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు దాదాపు సమానంగా విజయం సాధించడంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రెండు పార్టీలు మేజిక్ ఫిగర్ కోసం అన్ని ప్రయత్నాలు చేపట్టాయి.
రెండు పార్టీలకు సమాన సీట్లు రావడంతో 15వ వార్డులో విజయం సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు ఇప్పుడు కింగ్ మేకర్‌గా మారారు. దీంతో అతడి మద్దతును పొందేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పాండును తమ వాహనాల్లో ఎక్కించుకుని అక్కడి నుంచి బయటికి తరలించేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

రెండు పార్టీలు తన కోసం ఘర్షణ పడుతుండటంతో ఇప్పుడు కింగ్ మేకర్‌గా ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మద్దతు ఇవ్వాలంటే మున్సిపల్ ఛైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. దీంతో రెండు పార్టీల నేతలు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. తన డిమాండ్‌కు వారు ఒప్పుకోకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన పాండు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర అయోమయంలో పడ్డారు. మరోవైపు.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అదనపు బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లాఠీలతో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ప్రకటించారు.

Latest