Mahaa Daily Exclusive

  వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రభంజనం … కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను దెబ్బకొట్టిన కవిత…

Share

గద్వాల, మహా : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఓచోట ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తుండగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సొంతం చేసుకుంది. ఇతర చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే, వడ్డేపల్లిలో మాత్రం ఫలితం విభిన్నంగా వచ్చింది. ఇక్కడి ఓటర్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి విజయాన్ని అందించారు. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చాటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఒక్కో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కవిత మద్దతుదారులు ఈ ఒక్క స్థానంలో ఓటర్లను మెప్పించారు.

కవిత ఎఫెక్ట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు షాక్..

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో, ఒక చిన్న పార్టీ ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. దాంతో ఇక్కడ ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా బరిలోకి దిగిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రధాన పార్టీలను కాదని, స్థానికంగా అందుబాటులో ఉండే నేతలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ విజయంతో వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాయి. ఈ ఫలితం రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు ఒక విభిన్నమైన సందేశాన్ని పంపినట్లయ్యింది.

Latest