Mahaa Daily Exclusive

  జనజీవన స్రవంతిలోకి రావాలి: మావోయిస్టులకు డిజిపి పిలుపు .

Share

హైదరాబాద్, మహా :అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపుమేరకు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వారంతా తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని డిజిపి పేర్కొన్నారు. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన 588 మంది తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు లొంగిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వీరందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకం కింద లభించే అన్ని రకాల ప్రయోజనాలను అందజేశామని, ప్రస్తుతం వీరంతా తమ సొంత గ్రామాల్లో కుటుంబాలతో కలిసి ఎంతో క్షేమంగా, సంతోషంగా జీవిస్తున్నారని డిజిపి వారిని అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల పట్ల నమ్మకం, అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అజ్ఞాత మావోయిస్టులు సైతం ఇక్కడి పోలీసుల ఎదుట లొంగిపోయి సమాజంలో కలిసిపోతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మిగిలిన 15 మంది మావోయిస్టు నాయకులు, కేడర్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాంతియుత భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని డిజిపి శివధర్ రెడ్డి పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందజేయడంతో పాటు, వారు సమాజంలో ఆత్మగౌరవంతో బతికేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతియుత మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, సాయుధ మార్గం, అజ్ఞాతవాసం వీడి బయటకు రావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిజిపి సూచించారు

Latest