Mahaa Daily Exclusive

  “తగ్గిన సీట్లు.. పెరిగిన ఓట్లు: నారాయణపేట్, భైంసా, కరీంనగర్‌లలో కమల వికాసం” – బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

Share

  • సీట్లు తక్కువైనా ఓట్లు పెరిగాయి
  • నారాయణపేట్, భైంసాతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ లు దక్కాయి
  • ఎంఐఎంకు ఓట్లు తగ్గినా ప్రభావం చూపింది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మహా : మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినా ఓట్లు పెరిగాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్​ కార్పొరేషన్తో పాటు నారాయణపేట, భైంసా మున్సిపాలిటీల్లో బీజేపీ చైర్​ పర్సన్​ పీఠం పదవి దక్కించుకుందని తెలిపారు. భైంసాలో గత కాంగ్రెస్​ హయాం నుంచే బీజేపీ కార్యకర్తలు, హిందూ ధార్మిక సంస్థల సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారని, ఎట్టకేలకు మజ్లిస్ కు చెక్ పెట్టగలిగామన్నారు. ఇంతకాలం కాంగ్రెస్​ మజ్లిస్​ కలిసి భైంసాలో బీజేపీకి ఛైర్మన్ పీఠం దక్కకుండా చేశారన్నారు. భైంసాలో ఎంఐఎం పార్టీ ఎన్నో ఆగడాలకు పాల్పడిందన్నారు. మాకు మున్సిపాలిటీలు తక్కువగా వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగిందన్న సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా చాలా మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా ఆధిక్యం చూపిందని, ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. గతానికి భిన్నంగా బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయని, 15 ప్లస్ మున్సిపాలిటీల్లో సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా బీజేపీ అవతరించిందని తెలిపారు. ఖమ్మం, వరంగల్​, కొత్తగూడం, పరకాల లాంటి చోట్ల బీజేపీ సత్తా చాటిందని, చాలా చోట్ల మా ఓటు బేస్​ పెరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ కు గతం కంటే 14 శాతం ఓట్లు తగ్గాయని, ఆ పార్టీ ఇప్పుడు కేవలం 13 మున్సిపాలిటీలకు పరిమితమైందన్నారు. అధికారంలో ఉన్న అధికార పార్టీకి కూడా మెజార్టీ సీట్లు రాలేదని, చరిత్రలో మొట్టమొదటిసారిగా కరీంనగర్​ మేయర్​ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందన్నారు. నిజామాబాద్​ లో 28 చోట్ల బీజేపీ గెలిచి.. సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా బీజేపీ అవతరించిందని, అక్కడ కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలను వెలికి తీసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నారు. నిర్మల్​ లో ఒక వార్డులో ఎప్పుడూ లేనంతగా మైనార్టీ ఓట్లు పెరిగాయని, దీని మీద మాకు అనుమానం ఉంది, ఈసీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. 20 శాతం నుంచి 57 శాతానికి మైనార్టీ ఓట్లు ఎలా పెరిగాయన్నది తేలాల్సి ఉందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్​, బీఆర్​ఎస్, కమ్యూనిస్టులు​ కలిసి బీజేపీకి మేయర్​, చైర్​ పర్సన్​ పదవులు రానివ్వకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. మూడు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎక్కడా ఎర్రజెండా లేకున్నా తెలంగాణలో కాంగ్రెస్​ ఎర్రజెండాకు అధికారం వచ్చేలా చేస్తున్నదని దుయ్యబట్టారు. ఓట్లు సీట్ల కోసం కాకుండా బీజేపీ ఎప్పుడూ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని, అందుకే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు.

ఏప్రిల్ ఎస్ఐఆర్

ఏప్రిల్​ లో ఎస్​ఐఆర్​ రాబోతున్నదని, హైదరాబాద్​ లో దొంగ ఓట్లు, బయటి ఓట్లు తీసేయబోతున్నామన్నారు. బీఎల్​ వోలు, ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాచందర్ రావు పిలుపునిచ్చారు. ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఒక్కో ఇంటిపై 60 ఓట్ల వరకు నమోదు చేస్తున్నారన్నారు.

Latest