- తమిళ రాజకీయాలలో మరో సంచలనం
- కోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్, నటుడు విజయ్ భార్య
- విడాకులు కావాలంటూ పిటిషన్ దాఖలు
- అక్రమ సంబంధమే కారణమని విజయ్ భార్య సంగీత ఆరోపణ
- తన వద్ద ఆధారాలున్నాయంటూ పిటిషన్ లో వెల్లడి
మహా : తమిళ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత విజయ్ చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్‌పట్టులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివాహ జీవితం సజావుగా కొనసాగడం లేదని, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందిన సంగీతతో విజయ్ వివాహం 1999లో జరిగింది. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైన కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని సినీవర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్తో సినీ నటి త్రిషకు మధ్య సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఇవే కామెంట్స్ చేశారు. త్రిష ఇంటిని విడిచి విజయ్ ప్రజల్లోకి రావాలంటూ బీజేపీ నాయకుడు నయినర్ నాగేంద్రన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద వివాదానికి దారి తీశాయి. నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించడం.. ఆ తర్వాత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పడంతో వివాదం కాస్త సద్దు మణిగింది. ఇంతలో సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో.. విజయ్ – త్రిష రిలేషన్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ఆయన రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనే చర్చ ప్రస్తుతం జోరందుకుంది. అయితే, విజయ్ అభిమానులు మాత్రం ఇదేమంత ప్రభావం చూపే అంశం కాదని అంటున్నారు.
అభిమానుల్లో ఆందోళన
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో విజయ్ ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఈ వార్త అభిమానులను కలవరపరిచింది. సోషల్ మీడియాలో అభిమానులు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. కొందరు ఇది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. సంగీత పిటిషన్ వెనుక ఎవరున్నారన్నది అందరికీ తెలుసని, రాజకీయంగా విజయ్ ను ఎదుర్కోలేక ఈ రకంగా ఆటంకాలను సృష్టిస్తున్నారన్న వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి.








