Mahaa Daily Exclusive

  రాజు వెడ్స్ రాంబాబు సినిమా సీన్ రిపీట్……

Share

  • మేడ్చల్‌ జిల్లాలో అమానుషం
  • రాజు వెడ్స్ రాంబాబు సినిమా సీన్ రిపీట్
  • పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది
  • నిందితుడి అరెస్టు

హైదరాబాద్, మహా : ప్రేమ ఉన్మాదంగా మారితే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని చెప్పడానికి మేడ్చల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘటనే నిదర్శనం. సినిమా కథలను తలపించేలా అంతకంటే క్రూరంగా ఒక యువకుడు తన మరదలిపై పగ తీర్చుకున్నాడు. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఆమె జీవితాన్ని అంధకారం చేయాలనే దురుద్దేశంతో తనకు ఉన్న ఎయిడ్స్‌ వ్యాధిని అమెకు కూడా అంటించాడు. బలవంతంగా హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన అమానుష ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రేమ పేరిట కక్ష

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మేడ్చల్‌ జిల్లా అన్నోజి గూడకు చెందిన మనోహర్ అనే యువకుడు తన మరదలిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. తన మేన మరదలు తనకు కాకుండా మరో వ్యక్తికి భార్య కాబోతుందన్న నిజాన్ని మనోహర్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఈ అసూయ, కోపం క్రమంగా ఆమెపై పగగా మారింది. ఆమె జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా భయంకరమైన కుట్రకు తెరలేపాడు.

రాజు వెడ్స్ రాంబాయి సినిమా స్ఫూర్తితో ఘాతుకం

ఈ క్రూరమైన పగ తీర్చుకోవడానికి మనోహర్ ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి అనే తెలుగు సినిమాను ప్రేరణగా తీసుకున్నాడు. ఆ సినిమాలో చూపిన విధంగానే తనకు ఉన్న హెచ్ఐవీ వ్యాధిని ఆ యువతికి అంటించాలని నిర్ణయించుకున్నాడు. యువతి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో ఆమె ఇంటికి వెళ్లి సైలెంట్‌గా హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆమె శరీరంలోకి ఎక్కించాడు.

బయటపడ్డ భయంకర నిజం

ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత సదరు యువతి తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురైంది. సాధారణ జ్వరమే అని భావించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే వచ్చిన రిపోర్టులను చూసిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పెళ్లి సిద్ధమవుతున్న ఆ యువతికి హెచ్ఐవీ పాజిటవ్‌ అని నిర్దారణ అయ్యింది. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తెకు ఈ వ్యాధి ఎలా సోకిందని ఆరా తీయగా మనోహర్ చేసిన దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. మనోహర్‌ ఉద్దేశపూర్వకంగానే తన రక్తాన్ని ఆమెకు ఎక్కించాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

నిందితుడు అరెస్టు

బాధిత యువతి, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడ్చల్‌ జిల్లా పోచారం పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు మనోహర్‌ ను అదుపులోకి తీసుకుని విచారించగా, పగతోనే ఈ పని చేసినట్టు తేలింది. పోలీసులు అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక యువతి భవిష్యత్, ఆమె వైవాహిక జీవితాన్ని అత్యంత క్రూరంగా దెబ్బతీసిన నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని స్థానికులు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.