- రాష్ట్ర కాంగ్రెస్ కు కుదుపు జీవన్న చూపు గులాబీ వైపు
- జగిత్యాల కాంగ్రెస్ లో కలకలం
- కేటీఆర్ తో భేటీకి రంగం సిద్ధం
- ఉగాది తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని నిర్ణయం
జగిత్యాల, మహా : కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో జీవన్ రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలవగా, జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే, అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం, ఆయనకు ప్రభుత్వం , పార్టీలో ప్రాధాన్యత పెరగడం జీవన్ రెడ్డికి మింగుడుపడటం లేదు. తనను సంప్రదించకుండానే బద్ధ శత్రువును పార్టీలోకి తీసుకోవడం తనను అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీపై ఆయన చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
కేసీఆర్‌తో భేటీకి రంగం సిద్ధం
ఇటీవల ఆయన తాను పార్ట మారే ఆలోచనలో ఉన్నానని చెబుతున్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసి, గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జగిత్యాలలోని తన అనుచరులతో, కీలక నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మార్పుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ పూర్తి చేశారని, మెజారిటీ అనుచరులు ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపారని సమాచారం.
కాంగ్రెస్ బుజ్జగింపులు విఫలం
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, సంజయ్ కుమార్ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే, ప్రత్యర్థిని తెచ్చి నెత్తిన కూర్చోబెట్టడం ఏమిటి అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ పరిణామక్రమాలతో ఆయన వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే, జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. కాంగ్రెస్ కేడర్‌లో చీలక రావడం ఖాయం. అటు బీఆర్ఎస్‌కు ఈ సీనియర్ నేత రాక పెద్ద బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ మారే అంశంపై జీవన్ రెడ్డి నుంచి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత
కాంగ్రెస్ పార్టీతో తాటిపర్తి జీవన్ రెడ్డికి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విడదీయలేని అనుబంధం ఉంది. 1980వ దశకంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, జగిత్యాల నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, భవనాల శాఖ వంటి కీలక మంత్రి పదవులను నిర్వహించిన జీవన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ఓటమి ఎదురైనప్పుడు కూడా పార్టీని వీడకుండా విధేయుడిగా ఉన్న ఆయన తెలంగాణ ఉద్యమం తర్వాత వెనుకబడిపోయారు. వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు.








