Mahaa Daily Exclusive

  ఒక్క రోజే 2 లక్షల 30 వేలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ…

Share

  • సగటు వినియోగం కంటే ఎక్కువ
  • ఒక్క రోజే 2 లక్షల 30 వేలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ
  • కొరత లేదు, వినియోగదారులలో భయాందోళన పెరిగింది
  • ఎల్ పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి

హైదరాబాద్, మహా : తెలంగాణలో ఎల్పీజీపై సంక్షోభం నెలకొంది. కమర్షియల్ సిలిండర్లే కాదు.. గృహ వినియోగ సిలిండర్ల మీద జనాల్లో ఆందోళన ఉంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు.. సాధారణ రోజువారీ సగటు కంటే అదనంగా 12,000 సిలిండర్లను శుక్రవారం పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం పంపిణీ చేసిన మొత్తం 2,37,123 ఎల్పీజీ సిలిండర్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 83,166, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 88,257, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 65,700 సిలిండర్లు పంపిణీ జరిగాయి.

తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ అవసరం 2.5 లక్షలు కాగా ఇందులో 86 శాతం గృహావసరాలకు, మిగిలిన 14 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. రాష్ట్రంలో మొత్తం 1.29 కోట్ల క్రియాశీల గృహ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 810 మంది పంపిణీదారులు సేవలు అందిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అందించిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రం 10,611 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలను కలిగి ఉంది. ఇది సుమారు 6.97 లక్షల సిలిండర్లకు సమానం. తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జగన్ మోహన్ రెడ్డి ప్రకారం, ఆర్డర్ల ఆకస్మిక పెరుగుదల పంపిణీ నెట్‌వర్క్‌ను స్తంభింపజేసింది. రాష్ట్రంలోని అనేక ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని ఆయన అన్నారు. సిలిండర్లు ఊహించని విధంగా వినియోగదారులు బుక్ చేసుకోవడంతో వ్యవస్థ దెబ్బతిందన్నారు. గురువారం అనేక ప్రదేశాలలో సాంకేతిక, కార్యాచరణ ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. ‘గృహ వినియోగ సిలిండర్లకు సంబంధించి ఎటువంటి సమస్య లేదు. క్రమం తప్పకుండా సరఫరా కూడా ఉంది. కానీ వినియోగదారులలో భయాందోళనతో బుకింగ్ ఉంది. కాబట్టి పెండింగ్ పెరుగుతోంది.’ అని కల్లూరి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 810 ఎల్పీజీ పంపిణీదారులు 1.30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెలా దాదాపు 60 లక్షల ఎల్పీజీ గృహ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. మూడు లేదా నాలుగు రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపుగా లేదని కల్లూరి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కొంతమంది దగ్గర కొంత పాత స్టాక్ ఉండాలని, దానిని ప్రీమియం ధరకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.