Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో భారీగా కుళ్లిన చికెన్ పట్టివేత: బార్లు, రెస్టారెంట్లకు విషతుల్యమైన మాంసం సరఫరా!

Share

  • హైదరాబాద్‌లో దారుణం.
  •  బార్లు, రెస్టారెంట్లకు కుళ్లిన చికెన్ సరఫరా.
  •  800 కిలోల మాంసం పట్టివేత!

హైదరాబాద్, మహా.
నగరంలో పెరుగుతున్న చికెన్ ధరలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతంలో కుళ్లిపోయిన చికెన్‌ను నిల్వ ఉంచి వివిధ హోటళ్లకు విక్రయిస్తున్న ఒక భారీ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ , జీహెచ్‌ఎంసీ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు.
సికింద్రాబాద్ పరిధిలోని పార్శిగుట్టలో ఉన్న ‘ఏ1 ఫ్రెష్ చికెన్ షాప్’ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారులే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన, తీవ్ర దుర్వాసన వస్తున్న సుమారు 800 కేజీల కుళ్లిపోయిన చికెన్‌ను అధికారులు గుర్తించి అక్కడికక్కడే సీజ్ చేశారు.
ఎండల తీవ్రతతో పాటు మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300కి పైగా పలుకుతున్న ప్రస్తుత పరిస్థితులను ఈ ముఠా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఎక్కడో చనిపోయిన, కుళ్లిపోయిన కోళ్ల మాంసాన్ని సేకరించి, దానిని నగరంలోని వివిధ బార్లు, వైన్స్, రెస్టారెంట్లకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. జనం ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, బార్లలో ఇచ్చే స్టాటర్స్‌లో ఈ విషతుల్యమైన మాంసాన్నే వాడుతున్నట్లు అధికారులు గుర్తించడం నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రజల ఆరోగ్యానికి ప్రాణసంకటంగా మారిన ఈ షాపునకు కనీస అనుమతులు కూడా లేవు. ఏ1 చికెన్ షాపు ట్రేడ్ లైసెన్స్ గడువు ఎప్పుడో ముగిసినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ షాపును సీజ్ చేసి, ఈ అక్రమ వ్యాపారానికి సూత్రధారి అయిన ప్రధాన నిర్వాహకుడు షకీల్‌తో పాటు అతనికి సహకరిస్తున్న మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. అరెస్టయిన నిందితుల నుంచి సమాచారం రాబట్టి, ఈ కుళ్లిన చికెన్‌ను ఏయే రెస్టారెంట్లకు, బార్లకు సరఫరా చేశారనే కోణంలో కూపీ లాగుతున్నారు.