- పైలట్ పై కేసీఆర్ సీరియస్
- షోకాజు నోటీసు జారీ
- డ్రగ్స్ పార్టీపై కేసీఆర్ ఆరా
- వివరాలను కోరిన అధినేత
హైదరాబాద్, మహా : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. ‘డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు’ నోటీసుల్లో పేర్కొంది. మీ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఆదేశించింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో మార్చి 14న జరిగిన డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో కొకైన్‌తో సహా డ్రగ్స్ సీజ్ చేశారు. పార్టీలో ఉన్న రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మతో సహా పలువురికి నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే పోలీసులను చూసిన వెంటనే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
కేసీఆర్ ఆరా
పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత మంది నేతలతో ఆరా తీసినట్లు సమాచారం. పైలట్ తీరు పార్టీకి నష్టం కలిగించేదిగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్ ఆయనను పార్టీ నుంచి పంపించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. గతంలోనూ ఆయన ఫాంహౌజ్ లో బీజేపీ నేతలతో సంప్రదింపులకు తెరలేపడం, తీరా పార్టీ నేత గ్రహించి హెచ్చరించడంతో ప్లేట్ పిరాయించి కొనుగోలుకు బీజేపీ యత్నిస్తుందంటూ బుకాయించడం తదితర పరిణామాలన్నింటినీ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసావించినట్లు తెలిసింది. ఏది ఏమైనా పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీలో పట్టు బడటం, పార్టీలో ఉన్న ఒకరు పోలీసులపై కాల్పులకు తెగబడటం తదితర పరిణామాలన్నింటిపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికి షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో సదరు నేత వివరణ అనంతరం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.








