Mahaa Daily Exclusive

  జగ్గారెడ్డి మరో పీజేఆర్….

Share

  • జగ్గారెడ్డి మరో పీజేఆర్
  • ఎప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్
  • ఆయనకు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా
  • మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ పదవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇవ్వాలంటూ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలన్నారు. జగ్గారెడ్డి ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే మాస్‌ లీడర్‌ అని ప్రశంసలు గుప్పించారు.

ఎవరైనా ఆపదలో ఉంటే జగ్గారెడ్డి వెంటనే ఆదుకుంటారని, ఆయన మరో పీజేఆర్‌ (పి.జనార్థన్ రెడ్డి) అని మంత్రి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌గా జగ్గారెడ్డి ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 స్థానాలు వస్తాయని వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డికి ఉన్న నాయకత్వ లక్షణాలపై ప్రశంసల జల్లు కురిపించారు. జగ్గారెడ్డి పనితీరు చాలా బాగుంటుందని కొనియాడారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతుండగానే మంత్రి కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అటు పార్టీలో, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ మంత్రి వర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌ను కూడా మార్చాలంటూ పరోక్షంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి.