Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌కు బిగ్ షాక్: కమలం గూటికి సీనియర్ నేత జీవన్ రెడ్డి? ఎంపీ అర్వింద్ వ్యూహంతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!

Share

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం..
*బీజేపీ వైపు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అడుగులు!
హైదరాబాద్ , మహా.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. సుమారు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, ఆ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారాలనే కఠిన నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి, జగిత్యాల నియోజకవర్గంపై తనదైన చెరగని ముద్ర వేసిన జీవన్ రెడ్డి లాంటి వివాదరహితుడైన నేత కాంగ్రెస్ ను వీడటం ఆ పార్టీకి తీరని లోటని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, అధిష్ఠానం ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం జీవన్ రెడ్డి వర్గానికి తీవ్ర మనస్థాపం కలిగించింది. తనను కనీసం సంప్రదించకుండా తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి చేర్చుకోవడం, ఆపై తనకు పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడం ఆయన అసంతృప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చిందించిన తనకు దక్కుతున్న అవమానాలను ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుచరవర్గం బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తోంది.
సరిగ్గా ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మలచుకునేందుకు భారతీయ జనతా పార్టీ పకడ్బందీగా పావులు కదుపుతోంది. జీవన్ రెడ్డి లాంటి ఉద్దండుడైన నేతను పార్టీలోకి ఆహ్వానిస్తే ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కమలం పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వయంగా రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో తెరవెనుక కీలక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరితో ఉన్న అర్వింద్, ఆయనను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ కు భారీ రాజకీయ దెబ్బ కొట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ చేరిక ప్రపోజల్‌ను రాష్ట్ర నాయకత్వం ద్వారా అధిష్ఠానం దృష్టికి కూడా ఎంపీ అర్వింద్ తీసుకెళ్లినట్లు సమాచారం.
అంతా అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే జీవన్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి నితిన్ నబిన్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం కానీ, లేదా ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభను కానీ ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అతిపెద్ద షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు కమలం గూటికి చేరడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు భారీ గండి పడటమే కాకుండా, భవిష్యత్తులో ఆ పార్టీలోని ఇతర అసంతృప్త నేతలు కూడా ఈ మార్గాన్ని అనుసరించే ప్రమాదం లేకపోలేదు. మొత్తం మీద దశాబ్దాల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడి చేరికతో బీజేపీ రాష్ట్రంలో తన బలాన్ని మరింత పదిలపరుచుకోవాలని చూస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ఈ అనూహ్య రాజకీయ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.