Mahaa Daily Exclusive

  రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​ – ముగ్గురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సస్పెండ్​

Share

 

మహా
రాజ్యసభ ఎన్నికల క్రాస్ ఓటింగ్​కు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ సస్పెండ్ చేసింది. సోఫియా ఫిర్దౌస్, రమేష్ జెనా, దాశరథి గోమాంగో అనే ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేస్తున్నట్లు ఒడిశా కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. “సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్టీ ఆదేశాలను ధిక్కరించి బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా గజపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, సనఖేముండి ఎమ్మెల్యే రమేష్ జెనా, బారాబతి-కటక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ఈ ముగ్గురినీ సస్పెండ్ చేశాం” అని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం ఛైర్మన్ అరబింద దాస్ అన్నారు. అసెంబ్లీలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్, నాలుగో రాజ్యసభ స్థానానికి బీజేడీ అభ్యర్థి దత్తేశ్వర్ హోటాకు మద్దతు ప్రకటించింది. అయితే, బీజేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే గెలిచారు. రేకు అనుకూలంగా బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు వేసిన క్రాస్ ఓటింగ్ వల్ల రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షానికి కేవలం ఒక అభ్యర్థి విజయం మాత్రమే దక్కింది. అటు బీజేపీ సునాయాసంగా రెండు సీట్లను గెలుచుకోగా, ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. వీరిలో బీజేపీ అభ్యర్థులు మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్, బిజూ జనతా దళ్ అభ్యర్థి సంతృప్త మిశ్రా, స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే ఉన్నారు.