Mahaa Daily Exclusive

  తెలంగాణ ఎన్నికలు 2029లోనే.. అసెంబ్లీకి కేసీఆర్ రావాలి: ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Share

  • 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు
  • తెలంగాణకు 2028లో జరగవు
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే బెయిల్
  • ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీకి కేసీఆర్‌ రావాలి.. సూచనలు, సలహాలు ఇవ్వాలి
  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్

ఢిల్లీ, మహా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరిగే అవకాశం కనిపించడం లేదని, జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం ‘‘మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్‌ వేశాం’’ అని చెప్పారు. 2029లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సీఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను రేవంత్‌రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని రాహుల్‌, ప్రియాంకలకు రేవంత్‌ పరిచయం చేశారు.

గవర్నర్ ప్రసంగం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు ఆవిష్కారం

గవర్నర్‌ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు వివరించామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గవర్నర్‌తో చర్చించిన తర్వాతే ప్రసంగాన్ని తయారు చేశామన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా.. రాచరికపు పోకడలు పోలేదు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి.. లేనప్పుడూ అదే ధోరణి’’ అని ప్రతిపక్షంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులని పేర్కొన్నారు. ‘‘కొత్త గవర్నర్‌ను కలిసేందుకు ప్రతిపక్ష నేత వస్తారనుకున్నాం. ప్రధాన ప్రతిపక్షం కూడా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందనుకున్నాం. గవర్నర్‌ ప్రసంగంపై సూచనలు, సలహాలు వస్తాయనుకున్నాం. ప్రధాన ప్రతిపక్షం నుంచి కనీస స్పందన రాలేదు. కేసీఆర్‌ సభకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన సభలో పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వాలి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విధానాలే కారణం. పీవీ, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తొలిసారి హైటెక్‌ సిటీకి పునాది రాయి వేశారు. అనంతరం చంద్రబాబు, వాజ్‌పేయీ హైటెక్‌ సిటీని పూర్తి చేశారు. ప్రస్తుతం ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది. సవాళ్లను ఎదుర్కోవడంపై విజన్‌ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టాం. హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గతంలో కేసీఆర్‌ అన్నారు. వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చాలని గతంలో కేటీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యాచరణనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది. అని సీఎం తెలిపారు.

Latest