Mahaa Daily Exclusive

  ఉగాది వేళ రైతులకు వరం..! త్వరలోనే సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం…!

Share

  • ఉగాది వేళ రైతులకు వరం..
  • త్వరలోనే సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం.
  • రైతు రాజు కావాలన్నదే మా లక్ష్యం.
  •  శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి ప్రతి రైతును రాజుగా నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రకృతి వైపరీత్యాలు దరిచేరకుండా ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని భగవంతుడిని మనసారా ప్రార్థించారు. అనంతరం ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి రచించిన శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, ఆయనచే పంచాంగ శ్రవణం ఆసాంతం ఆలకించారు.

ఈ వేడుకల వేదికగా రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి పలు కీలక హామీలు, తీపి కబుర్లు అందించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులను ఒక భూతంలా పట్టి పీడిస్తోందని విమర్శించిన ఆయన, ఆ ధరణిని తరిమికొట్టి దాని స్థానంలో ‘భూ భారతి’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎంతోకాలంగా రైతులు ఎదురుచూస్తున్న సాదా బైనామా భూములకు సంబంధించి అతి త్వరలోనే ఒక స్పష్టమైన పరిష్కారం చూపించబోతున్నామని ఆయన ఉగాది కానుకగా ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఇప్పటికీ తెలంగాణకు ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని ఆయన గుర్తుచేశారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఈ క్రమంలోనే సంక్షోభంలో ఉన్న రైతులను గట్టెక్కించేందుకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అదనంగా బోనస్ కూడా అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన వివరించారు.

రైతుల ఆర్థిక పురోగతికి సంబంధించి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం ఈ సందర్భంగా సగర్వంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25.35 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి దాదాపు రూ. 20,616 కోట్ల మేర రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తిచేసి, రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటికే రూ. 18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈ నెల 22న మిగిలిన రైతు భరోసా సాయాన్ని కూడా అందించబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్, రైతు బీమా అమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి నిర్ణయాలన్నీ రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో పెంచుతాయన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ముగింపులో వివిధ ఆలయాలకు చెందిన అర్చక స్వాములను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.

Latest