ఢిల్లీ, మహా.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో చోటుచేసుకున్న ఓ కీలక పరిణామం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అతానూ చక్రబర్తి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, దానికి ‘విలువలు, నైతికత’ అనే సున్నితమైన కారణాలను ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. ఈ హఠాత్పరిణామంతో బ్యాంకు లోపల అసలేం జరుగుతోందన్న అనుమానాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతుండగా.. షేర్ల విలువ ఒక్కసారిగా పతనం కావడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వదంతుల నేపథ్యంలో బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ కేకీ మిస్త్రీ, సీఈఓ శశిధర్ జగదీశన్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. సంస్థలో ఎలాంటి ఆధిపత్య పోరు లేదని, చిన్నపాటి అభిప్రాయ భేదాలను అంతర్గత కుమ్ములాటలుగా చూడొద్దని మిస్త్రీ కొట్టిపారేశారు. పైగా, రాజీనామాకు గల స్పష్టమైన కారణాలను చక్రబర్తి బోర్డుకు కూడా వివరించలేదని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోమని యాజమాన్యం ఎంత భరోసా ఇస్తున్నప్పటికీ, మార్కెట్ వర్గాలకు మాత్రం అది పూర్తి స్థాయిలో ఊరటనివ్వడం లేదు. షేర్ల పతనం కొనసాగుతుండటంతో, చక్రబర్తి ఆకస్మిక నిష్క్రమణ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.








