Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో కలకలం..! క్షణికావేశంలో రాలిపోయిన రెండు నిండు ప్రాణాలు..!

Share

హైదరాబాద్, మహా.

మహానగరంలో వరుస విషాదాలు నగర ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు ఆత్మహత్య ఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక యువతి తన పెంపుడు జంతువు మరణించిందన్న విషాదాన్ని దిగమింగుకోలేక ప్రాణాలు తీసుకుంటే, మరో బీటెక్ విద్యార్థిని ఉరేసుకుని తనువు చాలించడం తీవ్ర సంచలనంగా మారింది.

మీర్‌పేట పరిధిలో జరిగిన తొలి ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. బడంగ్‌పేట్ వెంకటాద్రి నివాస్‌లో ఉంటున్న ఇరవై ఏళ్ల హిమబిందు డిగ్రీ చదువుతోంది. గత రెండేళ్లుగా ఆమె ఒక పిల్లిని ఎంతో అల్లారుముద్దుగా, ప్రాణంగా పెంచుకుంటోంది. అయితే, ఆ పెంపుడు పిల్లి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. తన కళ్లెదుటే తిరిగిన మూగజీవి ఇక లేదన్న చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ తీవ్ర ఆవేదనతో నిన్న ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ విధి వక్రించి చికిత్స పొందుతూ ఆ యువతి తుదిశ్వాస విడిచింది. మూగజీవిపై ఉన్న ప్రేమ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది.

ఈ ఘటన మరవక ముందే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మరో దారుణం వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన నందిని అనే విద్యార్థిని.. నారపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. విద్యాభ్యాసం కోసం అక్కడే ఓ హాస్టల్‌లో అద్దెకు ఉంటున్న ఆమె, ఇవాళ తెల్లవారుజామున ఎవరూ ఊహించని రీతిలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం గదిలోకి వెళ్లిన తోటి విద్యార్థులు ఫ్యాన్‌కు వేలాడుతున్న నందిని మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, మృతురాలి తల్లిదండ్రులకు ఈ గుండె పగిలే వార్తను చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నందిని ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Latest