- ఇరాన్ చేతిలో ‘ఇంటర్నెట్’ బ్రహ్మాస్త్రం..
- కట్ అయితే ప్రపంచమంతా అంధకారమే!
- సముద్ర గర్భంలో మహా ముప్పు..
- కేబుల్స్ తెగితే ఆసియా, ఆఫ్రికాలకు డిజిటల్ డెత్
- క్షిపణులు కాదు.. డేటా బాంబ్..
- ఇరాన్ మాస్టర్ ప్లాన్‌తో వణికిపోతున్న అగ్రరాజ్యాలు.
- డిజిటల్ యుగానికి ఎండ్ కార్డ్?
ఢిల్లీ, మహా.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్.. ఈ మూడు దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు మూడో వారానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం అంతా ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబులు, క్షిపణుల గురించే భయపడింది. కానీ, ఇప్పుడు అంతకు మించిన పెను ముప్పు ఒకటి తెరపైకి వచ్చింది. అదే ‘ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం’. ఇరాన్ గనక ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే.. ఆసియా, ఆఫ్రికా ఖండాలు పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఆకాశంలో ఎగిరే బాంబుల కంటే, సముద్ర గర్భంలో పొంచి ఉన్న ఈ డిజిటల్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికా ఆర్థిక, నిఘా వర్గాలు సైతం ఇరాన్ తదుపరి వేయబోయే అడుగులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రపంచానికి ఇంధన సరఫరా చేసే నాడి లాంటి ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిని ఇరాన్ ఇప్పటికే తన గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పుడు ఆ దేశం కన్ను సముద్రం అడుగున ఉన్న ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ పై పడింది. మనం వాడుతున్న ఇంటర్నెట్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఈమెయిల్స్, ఏఐ సేవలు.. ఇలా సమస్తం ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే దాదాపు 20కి పైగా అత్యంత కీలకమైన సబ్‌సీ కేబుల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. కేవలం 200 అడుగుల లోతులో ఉండే ఈ కేబుల్స్ ను కట్ చేయడం ఇరాన్ రక్షణ దళాలకు వెన్నతో పెట్టిన విద్య. అదే జరిగితే ప్రపంచం దశాబ్దాల వెనక్కి వెళ్లిపోవడం తథ్యమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గతంలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అప్పట్లో కొన్ని కేబుల్స్ దెబ్బతిని ఆసియా, ఆఫ్రికాల్లో ఇంటర్నెట్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణం పీక్స్‌కి చేరడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఒకవేళ ఇరాన్ ఈ కేబుల్స్‌ను కత్తిరిస్తే.. వాటిని రిపేర్ చేయడానికి ఏ ఒక్క నౌక కూడా ఆ ప్రాంతానికి వెళ్లే సాహసం చేయదు. ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులెత్తేస్తాయి. అంటే, ఒక్కసారి కేబుల్ కట్ అయితే వారాల తరబడి డిజిటల్ ప్రపంచం స్తంభించిపోవాల్సిందే.
ఈ మహా ముప్పు దెబ్బకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు సైతం వణికిపోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో వారు పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ డేటా సెంటర్లు అన్నీ గాలిలో దీపాలుగా మారనున్నాయి. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఈ మార్గమే ప్రాణాధారం. ఇరాన్ టార్గెట్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయి, ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు అచేతనంగా మారుతాయి. ముడి చమురు కోసం మొదలైన ఈ పోరు కాస్తా.. చివరకు రాబందుల్లాంటి ‘డేటా యుద్ధం’గా మారి ప్రపంచాన్ని డిజిటల్ సమాధి చేస్తుందనే భయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.








