హైదరాబాద్, మహా.
నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా కొత్తవారి ఎన్నిక జరగలేదని, తాను కేవలం పొలిట్ బ్యూరో సభ్యుడిగానే కొనసాగుతున్నానని తిపరి తిరుపతి అలియాస్ దేవీజీ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వంపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, కేంద్ర కమిటీ నిర్ణయం లేకుండా కార్యదర్శి నియామకం జరగదని ఆయన పేర్కొన్నారు.
గురువారం హైదరాబాద్ వేదికగా వివిధ మాధ్యమాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు తిపరి తిరుపతి అలియాస్ దేవీజీ పలు కీలక విషయాలను వెల్లడించారు. నంబాల మృతి వెనుక కొందరి కుట్రలు ఉన్నాయని, ఆయన మరణం విప్లవోద్యమానికి కోలుకోలేని దెబ్బని ఆవేదన వ్యక్తం చేశారు. హిద్మా సైతం పోలీస్ కొరియర్ల ద్రోహానికి బలికావాల్సి వచ్చిందని, చిత్రహింసల అనంతరం ఆయన్ను పోలీసులు కాల్చి చంపారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కొందరు ద్రోహులు శత్రువులతో చేతులు కలపడం వల్లే కీలక నేతలు చిక్కుకుంటున్నారని దేవీజీ విశ్లేషించారు.
మల్లోజుల ఆశన్న వంటి వారు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆయుధాలతో సహా లొంగిపోవడం వల్ల ఉద్యమం బలహీనపడిందని దేవీజీ విమర్శించారు. వారి లొంగుబాటును పార్టీ తీవ్రంగా పరిగణించి ద్రోహులుగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఆపరేషన్ కగారు సమయంలో దట్టమైన అడవుల్లో నిర్బంధం పెరగడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ములుగు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో హైదరాబాద్‌లో పట్టుబడ్డానని, పోలీసులు చెబుతున్నట్లుగా తాము లొంగిపోలేదని, అరెస్టు మాత్రమే అయ్యామని స్పష్టం చేశారు. అరెస్టయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయని, పార్టీపై నిషేధాన్ని తొలగించి జైల్లో ఉన్న సానుభూతిపరులను విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు.
మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే ప్రజల పక్షాన నిలబడి చట్టబద్ధంగా పోరాటాలు చేస్తామని దేవీజీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, రైతు చట్టాలకు వ్యతిరేక పోరాటాల తరహాలో ప్రజా క్షేత్రంలో ఉద్యమిస్తామని చెప్పారు. తాము కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేయడం తమ లక్ష్యం కాదని, కేవలం ప్రజల కోసమే పనిచేస్తామని పునరుద్ఘాటించారు. అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పిస్తామని, ఒకవేళ ద్రోహం చేసిన వారు బహిరంగంగా తప్పులు ఒప్పుకుంటేనే భవిష్యత్తులో వారి గురించి ఆలోచిస్తామని తిరుపతి స్పష్టం చేశారు.








