Mahaa Daily Exclusive

  పులి బక్కపడినా చారలు పోవు.. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తా: ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Share

  • మాటకు మాట జవాబు కాదు
  • పులి బక్కపడినంత మాత్రాన.. పులి చారకలు పోవు.
  • తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తా
  • పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా : మాటకు మాట జవాబు కాదని, సమయం వచ్చినపుడు తన సత్తా ఏమిటో చూపిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. షామీర్ పేటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడిన రాజేందర్
పార్టీలు సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ సమాజ హితం కోరుకున్న వారు
చాలా మంది వచ్చారన్నారు. మాలాంటి వారికి శక్తి ప్రజలే ప్రసాదిస్తారనేందుకు ఇది ఒక గొప్ప నిదర్శనమన్నారు. నాయకుడికి డిగ్నిటీ ఉండాలి, నాయకుడు తన చరిత్రను హోదాను బట్టి సమాజంలో ఉన్న ప్రతిష్టను బట్టి వ్యవహరించాలి తప్ప భిన్నంగా వ్యవహరించకూడదని, అలా వ్యవహరిస్తే తప్పవుతుందన్నారు. ఎవరో మాట్లాడుతున్నారని మనం కూడా మాట్లాడాలనడం సరికాదని, స్పందించకపోతే ఆలోచించటం లేదు అని మాత్రం అనుకోవద్దన్నారు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందన్నారు. ఎన్నో దెబ్బలు తగిలాయి, అనేక గాయాలయ్యాయి. మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టే అని అనేకసార్లు చెప్పాను. మేము ఒకరి మేలుకోరే వారం తప్ప కీడు కోరే వారం కాదన్నారు. నిండు కుండ తొనకదు, రక్తం చిందించి, కొట్లాడి, ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అని అన్నారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురి అవుతున్నట్లు కనిపించవచ్చు.
డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అనుకూలంగా వార్తలు రాసుకోవచ్చు. కానీ అంతిమ విజయం ధర్మానిది మాత్రమే అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీ కోసమో, దొంగల కోసమో, పేదల భూములు గుంజుకునే వారి కోసమో, ఇళ్లను కూలగొట్టే వారి కోసమో, దొంగలే దొరల్లాగా చలామణి అయ్యే వారి కోసం కాదన్నారు. అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు నోళ్లు పెగలకపోవచ్చు. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు కూకటి వేళ్ళతో ఎలా పెకిలిస్తారో మనం ఇప్పటికే చూశామన్నారు. తెలంగాణ ప్రజలు కూడా లౌక్యం నేర్చుకున్నారని, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నారన్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాలకు రాలేదు, వ్యాపారంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. అప్పట్లోనే ఈటలతో పెట్టుకోవద్దని చాలెంజ్ చేసిన వాడిని అని గుర్తు చేశారు. పులి బక్కపడ్డ పులి చారకలు పోవు, అవమానాల నుండి అణిచివేతల నుండి అనేక ఘర్షణలు వస్తాయి, ఘర్షణల నుంచి మార్పు వస్తుంది, ఆ ఘర్షణల నుంచి ప్రజలకి మేలు జరుగుతుందని నమ్మేవాడినని చెప్పారు. కులానికి, మతానికి, ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ యావత్ ప్రజలు ప్రేమించే బిడ్డగా ఉన్నానని, తెలంగాణ ప్రజల ఆలోచన ఏముంటుందో నా ఆలోచన కూడా అదే ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచన ఆరాటం సఫలం అయ్యేవిధంగా కార్యాచరణ ఉంటుందని, పదవుల కోసం పెదవులను మూసే వాడిని కాదని, ప్రలోభాలకు తలొగ్గే వాడిని కాదని ఇప్పటికే నిరూపించుకున్నానని అన్నారు. ఉన్నంతకాలం ప్రజల పక్షాన ధర్మం, న్యాయం పక్షాన ఉంటానని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.

Latest