- హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో సెగలు
- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు
- మూకుమ్మడి పార్టీ పిరాయింపులకు రంగం సిద్ధం
- ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణం
హుజూరాబాద్, మహా : హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపై విసిగిపోయిన స్థానిక నేతలు, అనుచరులు త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించారు. సుమారు వందమందికిపైగా పాల్గొన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి జరిగిన రహస్య సమావేశంలో పలువురు నేతలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల కౌశిక్ రెడ్డి నిర్ణయాల వల్ల నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని కాదని, తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ముసలం కాస్త పార్టీ ఫిరాయింపుల వైపు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే అసంతృప్తి నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే జిల్లా మంత్రి సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హస్తం గూటికి చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంపై గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.








