Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ ‘ఆరు గ్యారెంటీలు’ ఎక్కడ?: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణుల అరెస్ట్, రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత!

Share

ఆరు గ్యారెంటీలు ఏవీ.. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలా?
* గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం.
* ఫ్రీ బస్సు మినహా మిగతా ఐదు హామీలు గాలికి.
* ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులపై ఉక్కుపాదం.
* అర్ధరాత్రి నుంచే వేలాది మంది కార్యకర్తల గృహనిర్బంధాలు.. 800 మందికి పైగా అరెస్ట్.
* పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు.

హైదరాబాద్, మహా.

అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణచివేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న కమలనాథులను పోలీసులు అడ్డుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రామచందర్ రావు.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించిన యువ, రైతు, దళిత, బీసీ డిక్లరేషన్లను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణాన్ని మాత్రమే అమలు చేస్తూ, మిగతా ఐదు గ్యారెంటీలను పక్కనపెట్టి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు రూ.8,000 కోట్లకు చేరుకున్నాయని, పాసైన విద్యార్థులకు సైతం సర్టిఫికెట్లు రాక వారి భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా బకాయిలు ఎప్పుడు ఇస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. వికలాంగులు, మహిళల పెన్షన్లు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వంటి అత్యవసర అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని ధర్నాలు చేసినా, వినతిపత్రాలు ఇచ్చినా సర్కారు స్పందించకపోవడం వల్లే నేడు ప్రజల వాణిని వినిపించేందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అర్ధరాత్రి నుంచే పోలీసులు వేలాది మంది కార్యకర్తలను గృహనిర్బంధం చేశారని, జిల్లాల నుంచి వస్తున్న వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని సుమారు 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 150 మంది మహిళలు సహా 800 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని రామచందర్ రావు ఆరోపించారు. ఎమ్మెల్సీల ఇళ్ల ముందు సైతం పోలీసులను మోహరించి బయటకు రాకుండా నిర్బంధించడం ఈ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టబోమని, ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Latest