- రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఇంధనం..
- నిరాటంకంగా సరఫరా చేస్తున్న చమురు సంస్థలు.
- కృత్రిమ కొరత సృష్టించొద్దు.
- గణాంకాలను వివరించిన బండి సంజయ్.
హైదరాబాద్:మహా.
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని చమురు డిపోల వద్ద దాదాపు 4.5 లక్షల కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇది సాధారణ వినియోగానికి కనీసం 15 నుంచి 20 రోజులకు పైగా సరిపోతుందని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, చమురు సరఫరా నిలిచిపోతుందనే అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. రాష్ట్రంలోని సుమారు 3,200 పెట్రోల్ బంకులకు ప్రతిరోజూ సుమారు 25 వేల కిలోలీటర్ల ఇంధనాన్ని చమురు కంపెనీలు నిరంతరం సరఫరా చేస్తున్నాయని, ఎక్కడా లోటు లేదని గణాంకాలతో సహా స్పష్టం చేశారు.
పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం మంత్రి కీలక వివరాలను వెల్లడించారు. సాధారణంగా ఒక బంకులో రోజుకు 5 వేల నుంచి 10 వేల లీటర్ల విక్రయాలు జరుగుతుండగా, వదంతుల కారణంగా ప్రజలు ఒకేసారి ఎగబడటంతో విక్రయాలు 5 రెట్లు పెరిగాయని తెలిపారు. నిమిషానికి వందల లీటర్ల ఇంధనాన్ని వాహనదారులు నింపుకుంటుండటంతో, బంకుల్లోని భూగర్భ ట్యాంకులు అకస్మాత్తుగా ఖాళీ అవుతున్నాయని, ఆ లోడ్‌ను భర్తీ చేసే ట్యాంకర్లు డిపోల నుంచి రావడానికి కొంత సమయం పడుతోందని వివరించారు. ఈ స్వల్ప విరామాన్ని చూసి ప్రజలు ఇంధనం అయిపోయిందని భ్రమపడుతున్నారని, దీనివల్లే కొన్ని చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని విశ్లేషించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, దేశ అవసరాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. సాధారణ అవసరాలకు మించి వాహనదారులు లీటర్ల కొద్దీ నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చమురు సరఫరా గొలుసులో ఎటువంటి అంతరాయం లేదని, ట్యాంకర్ల రవాణా నిరంతరం కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటించి, అసత్య వార్తలను ప్రోత్సహించవద్దని, కేవలం తక్షణ అవసరానికి సరిపడా ఇంధనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







