కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై..
- నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు!
- నమ్మిన సిద్ధాంతం.. అవమాన భారంతో వీడిన హస్తం: ఏఐసీసీకి రాజీనామా.
- మండలిలో గ్రీన్ కండువాతో సంచలనం.
- వలస నేతల పెత్తనంపై భగ్గుమన్న సీనియర్.
జగిత్యాల/హైదరాబాద్:మహా.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన బంటుగా దశాబ్దాల పాటు సేవలు అందించిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, బుధవారం ఏఐసీసీ ప్రాథమిక సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన జీవన్‌రెడ్డి, చివరకు పార్టీలో ఆత్మగౌరవం దెబ్బతిన్నదనే ఆవేదనతో హస్తం గుర్తును వీడారు. మండలిలో ఆయన కాంగ్రెస్ కండువాను తొలగించి, పచ్చ కండువా (గ్రీన్) కప్పుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
తన రాజీనామాకు గల కారణాలను జీవన్‌రెడ్డి లేఖలో అత్యంత స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల (బీఆర్ఎస్) నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం మరియు పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నించిన వారికే నేడు నామినేటెడ్ పదవుల్లో, మున్సిపల్ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘జై సంవిధాన్’ నినాదంతో రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుంటే, రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను గాంధీ భవన్‌కు పిలిచి గౌరవించడం తనను మనోవేదనకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికను, ఆయన కన్నెర్ర చేసిన నేపథ్యంలోనే తన అనుచరుడైన గంగారాం దారుణ హత్యకు గురవడం జీవన్‌రెడ్డిని మరింత కుంగదీసింది. ఒకవైపు ఫిరాయింపుల పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే, అదే ఎమ్మెల్యేను పార్టీ సమావేశాలకు ఆహ్వానించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆయన ఘాటుగా విమర్శించారు. నియోజకవర్గంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపిక నుంచి కౌన్సిలర్ టిక్కెట్ల వరకు అంతా వలస నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని, అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలలుగా తన గోడును అధిష్టానానికి విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఇక పార్టీలో కొనసాగడం ఆత్మవంచన చేసుకోవడమేనని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు.







