Mahaa Daily Exclusive

  మార్కాపురం మృత్యుఘోషపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి…

Share

*బాధితులకు అండగా ఉండాలని ఆదేశం!
* నిర్మల్ – నెల్లూరు బస్సు ప్రమాదంపై సీఎం విచారం.
* క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి.
* ఏపీ అధికారులతో తెలంగాణ సీఎస్ చర్చలు.
* రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

హైదరాబాద్‌,మహా.

నిర్మల్‌ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో చోటుచేసుకున్న ఈ పెను విషాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన శోకతప్త హృదయంతో విచారం వ్యక్తపరిచారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, బాధితులకు అవసరమైన తక్షణ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలు , బాధితుల స్థితిగతులపై ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధితులు మన రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. అగ్నిప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

Latest